రాజకీయ నాయకుడిగా చరిత్రకెక్కనున్న గిరిజనుడు

By రాణి  Published on  10 Feb 2020 6:54 AM GMT
రాజకీయ నాయకుడిగా చరిత్రకెక్కనున్న గిరిజనుడు

  • ఈయన ప్రజా సమస్యలను వినడు, మాట్లాడడు

ఆయన ప్రజా సమస్యలను వినడు. ప్రజా సమస్యల గురించి మాట్లాడడు. గంటల కొద్దీ ఉపన్యాసాలు దంచే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన మూగ, చెవిటి. ఆయనకు ఏదీ వినపడదు. ఆయన ఏమీ చెప్పలేడు. ఇది లాలూ అనే ఒక గిరిజనుడి కథ.

ప్రజాస్వామ్యపు ప్రహేళిక అనుకోండి..లేదా విధాత వ్రాసిన వింత వ్రాత అనుకోండి..మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణానికి 40 కి.మీ దూరంలోని దన్సారా అనే గ్రామంలో భారత దేశంలోనే తొలి మూగ, చెవిటి ప్రజా ప్రతినిధి సర్పంచ్ కాబోతున్నాడు. మధ్యప్రదేశ్ లో త్వరలో పంచాయతీ ఎన్నికలు కాబోతున్నాయి. ఈ ఎన్నికల రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో ఆదివారం నాడు నిర్ణయించారు. దీనిలో దన్సారా సర్పంచ్ షెడ్యూల్డు తెగలకు అంటే గిరిజనులకు చెందినవాడు కావాలని నిర్ధారించారు. తమాషా ఏమిటంటే దన్సారా గ్రామం మొత్తంలో ఒకే ఒక్క వ్యక్తి షెడ్యూల్డు తెగకు చెందినవాడు. అతడే మన కథానాయకుడు లాలూ. చిన్నప్పుడే అమ్మా నాన్నా చనిపోతే, ఊరి వాళ్ళే అతడిని పెంచారు. ఒకే ఒక్క గిరిజనుడు కాబట్టి సర్పంచ్ గా అయ్యే అర్హత అతనొక్కడికే ఉంది. కాబట్టి పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అతనొక్కడే అభ్యర్థి. అతనికి పోటీ ఇచ్చే వారే లేరు. కాబట్టి అతనే సర్పంచ్.

దేశం మొత్తంలో చెవిటి, మూగ రాజకీయ నాయకుడు లేనేలేడు. కాబట్టి దేశ చరిత్రలోనే తొలి చెవిటి, మూగ ప్రజా ప్రతినిధిగా లాలూ చరితకెక్కుతాడు. ఇలా ఆయనది ఒక చెరగని రికార్డు అవుతుంది. అంకవైకల్యం ఉన్న వారు ఎంపీలు, మంత్రులు అయిన దాఖలాలున్నాయి కానీ ఇలా మూగ, చెవుడు వ్యక్తి ప్రజా ప్రతినిధి కావడం ఇదే మొదటి సారి. తాను సర్పంచ్ కాబోతున్నాడన్న విషయం తెలిసిన లాలూ సంతోషానికి అవధులు లేవు. అప్పుడే సర్పంచ్ అయిపోయినట్టు ఆనందపడిపోతున్నాడు.

Next Story