దుబాయ్ ఎయిర్ పోర్ట్‌లో చిక్కుకున్న 300 మంది భారతీయులు

By Newsmeter.Network  Published on  12 Jan 2020 4:59 AM GMT
దుబాయ్ ఎయిర్ పోర్ట్‌లో చిక్కుకున్న 300 మంది భారతీయులు

ముఖ్యాంశాలు

  • దుబాయ్‌లో భారీ వర్షాలు, వరదలు
  • అల్ మక్తూమ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ప్రయాణికులు
  • కనీసం హోటల్ రూమ్ కూడా దొరికే పరిస్థితి లేదు
  • దాదాపు మూడొందలమంది భారతీయ ప్రయాణికుల అగచాట్లు
  • కనెక్టింగ్ ఫ్లైట్లు క్యాన్సిల్, దిక్కు తోచని స్థితిలో ప్రయాణికులు
  • జనవరి 14 తర్వాత విమాన సర్వీసుల రీ షెడ్యూల్

భారీ వర్షాల కారణంగా విమానాన్ని దారి మళ్లించడంతో దాదాపు మూడొందలమందికి పైగా భారతీయులు దుబాయ్ సమీపంలోని అల్ మక్తూమ్ విమానాశ్రయంలో చిక్కుపడిపోయారు. దాదాపుగా పన్నెండు గంటలనుంచీ తిండీ తిప్పలూ లేకుండా వారంతా బాధ పడుతున్నట్టుగా తెలియవస్తోంది. వీరిలో ఎక్కువమంది హైదరాబాద్ వాసులే ఉన్నట్టుగా అధికారిక సమాచారం.

యునైటెడ్ నేషన్స్ కి వెళ్తున్న చాలామంది ప్రయాణికులకు దుబాయ్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ దొరక్కపోవడంతో తీవ్రస్థాయి ఇబ్బందులకు లోనవుతున్నట్టుగా తెలుస్తోంది. చాలామంది పరిస్థితిని అర్థం చేసుకుని తమ విమానం టిక్కెట్లను రద్దు చేసుకుని మళ్లీ జనవరి 14 తేదీ తర్వాతకు ప్రయాణం తేదీలను మార్చుకుని అప్పటికి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఏది దొరికితే అది పట్టుకుని దుబాయ్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేందుకు నానా పాట్లు పడుతున్నారు.

అమెరికాకు వెళ్లేందుకు ఎమిరేట్స్ ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు అల్ మక్తూమ్ విమానాశ్రయంలో అసలు ఎమిరేట్స్ సిబ్బందిగానీ, అధికారులుగానీ అందుబాటులో లేరని ఆ విమానాశ్రయంలో చిక్కుపడిపోయిన కొందరు భారతీయులు చెబుతున్నారు. భారీవర్షాలు, వరదల కారణంగా దాదాపుగా అన్ని విమానాలు జనవరి 14వ తారీఖు తర్వాతకు రీ షెడ్యూల్ అయినట్టుగా తెలుస్తోంది.

ఉన్నపళంగా ఫ్లైట్లన్నీ రద్దు కావడంతో కనీసం హోటల్ రూములుకూడా దొరక్క ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. విమానయాన సర్వీస్ కంపెనీలు ఇచ్చే హోటల్ రూమ్ వోచర్లకోసం వందలకొద్దీ ప్రయాణికులు లైన్లలో పడిగాపులు పడుతున్నారు. కేవలం ఈ ఒక్క విమానాశ్రయం మాత్రమే కాక, దుబాయ్ లోని అల్ మక్తూమ్ చుట్టుపక్కల దగ్గరగా ఉన్న విమానాశ్రయాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్టు సమాచారం.

Next Story