మారని బ్యాట్స్‌మెన్లు.. భారమంతా తెలుగు కుర్రాడి పైనే..

By Newsmeter.Network  Published on  1 March 2020 7:44 AM GMT
మారని బ్యాట్స్‌మెన్లు.. భారమంతా తెలుగు కుర్రాడి పైనే..

క్రైస్ట్‌చర్చ్‌ : తొలి ఇన్సింగ్స్‌లో ఆధిక్యం లభించిందన్న ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మరోసారీ భారత బ్యాట్స్‌మెన్లు పెవిలీయన్‌కు క్యూ కట్టారు. కనీస పోరాటపటీమ లేకుండా నిర్లక్ష్యంగా వికెట్లను పారేసుకున్నారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకుని 97 పరుగుల లీడ్‌లో ఉంది. ప్రస్తుతం హనుమ విహారీ (5 బ్యాటింగ్‌), పంత్‌ (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. కివీస్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ మూడు వికెట్లతో రాణించగా.. గ్రాండ్‌హోమ్‌, వాగ్నర్‌, సౌతీలు ఒక్కొ వికెట్‌ను పడగొట్టారు.

కివీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారని అనడం కన్నా.. భారత బ్యాట్స్‌మెన్ల నిర్లక్ష్యం ఎక్కువగా ఉందనొచ్చు. అనవసర షాట్లకు పోయిన బ్యాట్స్‌మెన్లు చేతులారా వికెట్లను సమర్పించుకున్నారు. మయాంక్‌ అగర్వాల్‌(3)ను బౌల్ట్‌ బోల్తాకొట్టించగా.. సౌథీ బౌలింగ్‌లో పృథ్వీషా(14) తొందరపడ్డాడు. అనంతరం గ్రాండ్‌హోమ్‌ బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌కు రిప్లేగా మళ్లీ కోహ్లీ ఎల్బీగానే వెనుదిరిగాడు. ఇక రహానే (9)ను పక్కా వ్యూహంతో వాగ్నర్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. నాయవాల్ పుజారా (24) కూడా ఆదుకోలేకపోయాడు. నైట్‌వాచ్‌మన్‌ ఉమేశ్‌ యాదవ్‌ (1) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. దీంతో 89 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. మూడో రోజు రిషబ్ పంత్, హనుమ విహారి ఎలా ఆడతారనేదానిపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉంది.

కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. అంతకుముందు ఓవ‌ర్‌నైట్‌ స్కోరు 63/0 తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొన‌సాగించిన‌ న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌట్ అయింది. మహ్మద్‌ షమి 4, జస్‌ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో రాణించగా.. రవీంద్ర జడేజా 2, ఉమేష్ యాదవ్‌ ఒక వికెట్‌ ను పడగొట్టారు. దీంతో టీమిండియాకు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.

Next Story