కివీస్‌ను కట్టడి చేసిన బౌలర్లు.. టీమిండియాకు స్వల్ప ఆధిక్యం

By Newsmeter.Network  Published on  1 March 2020 5:34 AM GMT
కివీస్‌ను కట్టడి చేసిన బౌలర్లు.. టీమిండియాకు స్వల్ప ఆధిక్యం

కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. అంతకుముందు ఓవ‌ర్‌నైట్‌ స్కోరు 63/0 తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొన‌సాగించిన‌ న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌట్ అయింది. మహ్మద్‌ షమి 4, జస్‌ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో రాణించగా.. రవీంద్ర జడేజా 2, ఉమేష్ యాదవ్‌ ఒక వికెట్‌ ను పడగొట్టారు. దీంతో టీమిండియాకు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.

రెండో రోజు కివీస్‌ బ్యాట్స్‌మెన్లను భారత బౌలర్లు కట్టడి చేశారు. కట్టుదిట్టమైన బంతులతో పరుగులు రాకుండా అడ్డుకున్నారు. దీంతో కివీస్‌ బ్యాట్స్‌మెన్లపై ఒత్తిడి పెరిగింది. ఉమేష్‌ యాదవ్‌ బౌలింగ్‌లో బ్లండెల్(30) ఎల్బీగా వెనుదిరిగాడు. మరో మూడు పరుగులకే కెప్టెన్‌ కేన్‌ విలియమ్‌సన్‌(3) బుమ్రా బౌలింగ్‌లో కీపర్‌ చేతికి చిక్కాడు. దీంతో కివీస్‌ 69 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. అనంతరం రాస్‌టేలర్‌(15), టామ్‌ లాథమ్‌(52) ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నించారు. ఈ దశలో భారత బౌలర్లు విజృంభించడంతో కివీస్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.

హెన్రీ నికోల్స్ (14), వాట్లింగ్ (0), కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (26)ను చకాచకా పెవిలియకు చేరారు. దీంతో కివీస్ 177 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. దీంతో కివీస్‌ 200లోపు ఆలౌట్‌ అవుతుందని భావించారు. అయితే కైల్‌ జేమిసన్‌ (49) నీల్ వాగ్నర్‌(21) తొమ్మిదో వికెట్‌ కు 51 పరుగుల భాగస్వామ్యాన్నిజోడించారు. భారీ షాట్‌ ఆడబోయి జడేజా పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుతిరగగా.. మరో ఏడు పరుగుల తర్వాత షమి బౌలింగ్‌లోనే జేమిసన్‌ పంత్‌కు చిక్కడంతో కివీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. దీంతో భారత్ 7 పరుగుల ఆధిక్యం సాధించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Next Story