తొలి టెస్టు రేపటి నుంచే.. తెలుగు కుర్రాడు విహారికి ఛాన్స్‌..!

By Newsmeter.Network  Published on  20 Feb 2020 5:51 AM GMT
తొలి టెస్టు రేపటి నుంచే.. తెలుగు కుర్రాడు విహారికి ఛాన్స్‌..!

వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు వన్డే సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురి కావడం పెద్ద షాక్‌. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి కివీస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆరంభం కానుంది. కాగా.. టెస్టు ఛాంపియన్‌ షిప్‌(డబ్ల్యూటీసీ) నేపధ్యంలో ప్రతి టెస్టు ముఖ్యమే. ప్రపంచ టెస్టు ఛాంఫియన్‌షిప్‌ లో భారత్‌ 360 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్‌ 60 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. కోహ్లీ సేన ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా చవిచూడకపోగా.. కివీస్‌ మాత్రం ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు ఓడిపోయింది. ఈ లెక్కన కివీస్‌ను తక్కువ అంచనా వేయలేం.. సొంతగడ్డపై కివీస్‌ ఎప్పుడూ ప్రమాదకారినే.

రోహిత్ దూరం కావడంతో..

హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ గాయంతో టెస్టు సిరీస్‌కు దూరం కావడంతో మయాంక్‌ అగర్వాల్‌కు తోడుగా పృథ్వీ షా ఓపెనింగ్‌ చేయడం దాదాపుగా ఖాయం. బుధవారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌ ఇదే సంకేతాలను ఇచ్చింది. సన్నాహాక మ్యాచులో రెండు ఇన్నింగ్స్‌లో విఫలమైన శుభ్‌మన్‌ గిల్.. టెస్టు జట్టులో చోటు కోసం మరికొన్ని రోజులు నిరీక్షించకతప్పదు. అయితే ప్రతికూల పరిస్థితుల్లో కివీస్‌ పేసర్లను ఎదుర్కొని ఈ జోడి పరుగుల వరద పారించడం అంత సులువు కాదు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అతను శతకం బాదడంతో.. తెలుగు కుర్రాడు హనుమ విహారి ఆరో స్థానంలో బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బుమ్రా, షమిలతో కూడిన పేస్‌ దశం.. భారత్‌ బలం. కాగా గాయం నుంచి కోలుకున్న ఇషాంత్ శర్మ.. తుది జట్టులో ఉంటాడని కోహ్లి సూచనప్రాయంగా చెప్పాడు. స్పిన్నర్‌గా మాత్రం ఒకరికే చోటు ఉంది. అశ్విన్‌ లేదా జడేజాలలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిరం. 2013 నుంచి విదేశాల్లో ఇద్దరి రికార్డు దాదాపు ఒకేలా ఉంది. సన్నాహాకంలో అర్థశతకంతో రాణించడంతో కీపర్‌ రేసులోకి రిషబ్ దూసుకొచ్చాడు. పైగా విదేశాల్లో రిషబ్‌కు మంచి రికార్డు ఉండడంతో తుది జట్టులో రిషబ్‌చోటు ఇస్తాడా..? లేక ఎప్పటిలాగే సీనియర్‌ వృద్ధిమాన్‌ సాహాకు ను జట్టులోకి తీసుకుంటారనేది ఆసక్తిరంగా మారింది.

వన్డే సిరీస్‌ ఇచ్చిన ఉత్సాహాంతో..

ఇక..తొలి టెస్టుకు ముందే కివీస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేస్‌ బౌలర్‌ నీల్‌ వాగ్నర్‌ వ్యక్తిగత కారణాలతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. భార్య ప్రసవం కారణంగా వాగ్నర్‌ వెల్లింగ్టన్‌కు రావడం లేదని కివీస్‌ బోర్డు ప్రకటించింది. గత కొన్నేళ్లలో బౌల్ట్, సౌతీలతో పోలిస్తే వాగ్నర్‌ అత్యంత ప్రమాదకర కివీస్‌ బౌలర్‌గా మారాడు. కీలకమైన మ్యాచ్‌కు ముందు అతను దూరం కావడం జట్టుపై ప్రభావం చూపడం ఖాయం. ఇది సీనియర్లు బౌల్ట్, సౌతీలకు అదనపు భారం కానుంది. వాగ్నర్‌ స్థానంలో హెన్రీని తీసుకున్నారు. ఓపెనర్లుగా.. లాథమ్, బ్లన్‌డెల్‌ ఓపెనర్లుగా దిగనున్నారు. మూడు, నాలుగు స్థానాల్లో విలియమ్సన్, రాస్‌ టేలర్‌ల అనుభవమే జట్టుకు కీలకం. వీరిద్దరు తమ స్థాయికి తగినట్లుగా ఆడితే భారత్‌కు ఇబ్బందులు తప్పవు. వికెట్‌ కీపర్‌ వాట్లింగ్‌ బ్యాట్స్‌మన్‌గా కూడా తన సత్తా ఏమిటో ఇటీవలే ఇంగ్లండ్‌పై అద్భుత డబుల్‌ సెంచరీతో చూపించాడు. ఆల్‌రౌండర్‌గా గ్రాండ్‌హోమ్‌ సేవలను అందించగలడు. మ్యాచ్‌ ముందు రోజు పిచ్‌ను బట్టి చూస్తే కివీస్‌ నలుగురు పేసర్లతో దిగే ఛాన్స్‌ ఉంది.

పిచ్‌.. వాతావరణం

మ్యాచ్‌ వేదిక బేసిన్‌ రిజర్వ్‌ పిచ్‌పై సాధారణంగా పచ్చిక ఉంటుంది. డ్రాప్‌-ఇన్‌ పిచ్‌ పై మ్యాచ్‌ జరగనుంది. పేస్‌ బౌలర్లకు సహాకారం లభిస్తుంది. బంతి స్వింగయ్యే అవకాశముంది.

ఇప్పటి వరకు భారత్‌, న్యూజిలాండ్‌ మధ్యన 57 టెస్టులు జరగగా.. భారత్‌ 21 నెగ్గగా.. కివీస్‌ 10 గెలిచింది. 26 మ్యాచులు డ్రా ముగిసాయి.

Next Story