మన టూరిజం అధికారులకి చైనా వాళ్ల యువాన్లే కావాలి

By రాణి  Published on  31 Dec 2019 7:18 AM GMT
మన టూరిజం అధికారులకి చైనా వాళ్ల యువాన్లే కావాలి

బుద్ధ గయకో, సాంచీకో... సారనాథ్ కో వెళ్లినప్పుడు మీకు అక్కడ అర్థం కాని అక్షరాలు కచ్చిరి బిచ్చిరిగా నోటీసు బోర్డుల మీద కనిపిస్తే కంగారు పడకండి. ఆ వాక్యాలేం చెబుతున్నాయోనని తలలు బద్దలు కొట్టుకోకండి. అవి చైనా భాషలో ఉన్న సూచనలు. ఎందుకంటే చైనా గూడ్స్ వద్దు..కానీ చైనా వాళ్లు మాత్రం ముద్దు. ఇదీ మన టూరిజం డిపార్ట్ మెంట్ తాజా పాలసీ.

చైనా నుంచి యువాన్లు (అది వాళ్ల కరెన్సీ లెండి) జేబుల్లో నింపుకుని మన దేశంలోకి దిగుతున్న చైనీస్ టూరిస్టుల్ని ఆకర్షించడమే ఇప్పుడు మన టూరిజం డిపార్ట్ మెంట్ లక్ష్యం. ఇండియన్ కరెన్సీలో ఒక యువాన్ విలువ 10 రూపాయల 23 పైసలు. చైనా నుంచి ఏటా యాభై లక్షల మంది ప్రపంచమంతటా పర్యటిస్తూ ఉంటారు. అందులో మూడున్నర లక్షల మంది మన దేశంలోకి వస్తారు. చైనీయులు ఎక్కువగా బౌద్ధ క్షేత్రాలను సందర్శిస్తూంటారు. అక్కడ ధ్యానం కూడా చేస్తూంటారు. అలాంటి వారికి అన్ని విషయాలూ తెలియడానికి గాను నోటీసు బోర్డులన్నిటి మీదా చైనా భాషలో సూచనలు ఇస్తే వారికి ఉపయోగపడుతుందని మన అధికారులు భావించారు. అందుకే మన బుద్ధిస్టు సర్క్యూట్ లో చైనీస్ భాషలో సూచనలు వ్రాస్తున్నారు. ఒక్క చైనీస్ భాషే కాదు. కొరియా, శ్రీలంక నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తారు. అందుకే కొరియన్, సింహళ భాషల్లోనూ దారులను తెలిపే, విషయాలను వివరించే నోటీసులు పెట్టాలని మన టూరిజం అధికారులు నిర్ణయించారు.

అంతే కాదు. నేల, నింగి, నీరు దేన్నీ మన టూరిజం అధికారులు వదిలిపెట్టదలచుకోలేదు. అండమాన్ నికోబార్ ద్వీపాల్లో విదేశీ టూరిస్టులను ఆకర్షించేందుకు గాను వాటర్ డ్రోమ్ లు అంటే నేరుగా నీటిమీదే విమానాలు దిగే సదుపాయాన్ని కల్పించబోతున్నారు. అదే విధంగా ఆకాశాన్ని ముద్దాడే 137 హిమాలయ శిఖరాలను టూరిస్టుల పర్వతారోహణ కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని ఎక్కడం పై ఉన్న నిషేధాలను సడలించారు. మొత్తం మీద టూర్ దేవాయనమః అంటున్నారు మన టూరిజం అధికారులు.

Next Story
Share it