2020లో చుక్కల్లో 'పసిడి'

By రాణి  Published on  30 Dec 2019 8:04 AM GMT
2020లో చుక్కల్లో పసిడి

ముఖ్యాంశాలు

  • 2020లో పెరగనున్న బంగారం ధర
  • 10 గ్రా. ధర ప్రస్తుతం రూ. 38,800
  • 2020లో 10 గ్రా. అంచనా ధర రూ.44,000

చెన్నై : నిలకడైన లాభాలతో 2019లో ఓ మోస్తరు సజావుగానే సాగిన పసిడి ధరల ప్రయాణం 2020లో ఆకాశం అంచుల్ని తాకబోతోంది. కొత్త సంవత్సరంలో పసిడి ధర పది గ్రాములకు రూ.44,000 వేలు పలుకుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2019లో డాలర్ల లెక్కల్లో చూస్తే 18 శాతం, రూపాయల లెక్కల్లో చూస్తే 22 శాతం లాభాలను పసిడి ఆర్జించిపెట్టింది మార్కెట్ వర్గాలకు. 2019 చివర్లో కొద్దిగా పెరిగిన పసిడి ధర ఒడిదొడుకులు లేకుండా కాస్తంత నిలకడగా నిలబడే ప్రయత్నం చేస్తోంది. గత సంవత్సరం పది గ్రాముల బంగారం భారతీయ మార్కెట్లలో రూ.32,000 పలికింది. ఈ సంవత్సరం ఇప్పటికి రూ. 38,800 గా నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఈ లెక్కల్నిబట్టి పసిడి ధర భారీగా పెరిగినట్టే. వచ్చే సంవత్సరం ఇది మరింత పైపైకి పాకి ఆకాశం అంచుల్ని తాకే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఖచ్చితంగా ఏదో ఒక దశలో కనీసం రూ.44,000కు చేరుతుందని ఆశిస్తున్నారు.

ఇతరత్రా మదుపు మార్గాలతో పోలిస్తే బంగారంమీద పెట్టుబడి పెట్టడం ఎప్పటికైనా లాభదాయకమన్న ఆలోచన భారతీయుల్లో ఎప్పటినుంచో బలంగా నాటుకుపోయి ఉండడమే పసిడి ధరలు చుక్కల్ని తాకడానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. బుల్ రన్ 2019లో పసిడి ధరను బాగా పెంచిందనీ, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న విలువ కారణంగా భారత్ లోకూడా భారీగా బంగారం ధర పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనీ నిపుణుల అంచనా. బుల్ రన్ రాబోయే మూడు సంవత్సరాల్లో పసిడి ధర మరింతగా పెరగడానికి కారణమయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయంటున్నారు. 2019లో తారాస్థాయికి చేరిన అమెరికా, చైనా ఆర్థిక యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వ్యవస్థలను కుప్పకూలుస్తున్న విషయం తెలిసిందే. దీనివల్ల ప్రపంచంలోని అత్యంత కీలకమైన అనేక ఆర్థిక వ్యవస్థలుసైతం అల్లల్లాడిపోతున్నాయి. ఈ నేపధ్యంలో రిస్క్ చేసి చేతులు కాల్చుకోవడంకంటే బంగారంమీద పెట్టుబడి పెట్టడమే ఉత్తమం అన్న భావన మదుపరులకు బలంగా కలుగుతోందని మార్కెట్ నిపుణుల అంచనా.

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గందరగోళం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలు బాగా పెరిగిపోయాయని బులియన్ మార్కెట్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. దీనివల్లే 2019లో వడ్డీ రేట్లు చాలా తగ్గించాల్సిన పరిస్థితి తలెత్తింది. రిజర్వ్ బ్యాంక్ ఈ జాగ్రత్త తీసుకోకపోతే పెద్దపెద్ద కంపెనీలు సైతం కుప్పకూలిపోయే పరిస్థితిని ఎదుర్కోక తప్పేది కాదు.

Next Story