విజయం ముంగిట భారత్ బోల్తా.. కివీస్ దే వన్డే సిరీస్
By Newsmeter.Network Published on 8 Feb 2020 11:37 AM GMT
సిరీస్‌లో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో శనివారం జరిగిన రెండో వన్డేలో 274 పరుగుల లక్ష్యాన్ని బరిలోకి దిగిన టీమిండియా విజయానికి 22 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మూడు వన్డేల సిరీస్ ను న్యూజిలాండ్ 2-0తేడాతో ఆధిక్యంలో నిలవడంతో పాటు సిరీస్ ను కైవసం చేసుకుంది. సిరీస్‌లో చివరి మ్యాచ్ మంగళవారం ఉదయం 7.30 గంటల నుంచి బే ఓవల్ వేదికగా జరగనుంది.
274 పరుగుల లక్ష్య చేధనకు దిగిన టీమిండియాకు ఓపెనర్లు షా(24), మయాంక్ అగర్వాల్ (3) శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(15)తో పాటు పుల్ ఫాంలో ఉన్న రాహుల్ (4) వెంట, వెంటనే ఔటయ్యారు. శ్రేయాస్ అయ్యర్ (52; 57 బంతుల్లో 7x4, 1x6) ఫామ్‌ని కొనసాగిస్తూ హాఫ్ సెంచరీతో ఫర్వాలేదనిపించాడు. ఓ దశలో 129/6తో నిలిచినా.. రవీంద్ర జడేజా (55; 73 బంతుల్లో 2x4, 1x6), నవదీప్ సైనీ (45; 49 బంతుల్లో 5x4, 2x6) దూకుడుగా ఆడటంతో గెలిచేలా కనిపించింది. కానీ.. ఆఖర్లో మళ్లీ పుంజుకున్న కివీస్ బౌలర్లు భారత్‌ని 48.3 ఓవర్లలో 251కే ఆలౌట్ చేశారు. కివీస్ బౌలర్లలో బెన్నెట్, సౌదీ, జేమిసన్, కొలిన్ డి ఇంగ్రామ్‌లు తలా రెండు వికెట్లు తీశారు.
టాస్ ఓడిన బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు ఆ జట్టు ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్ (79; 79 బంతుల్లో 8 పోర్లు, 3సిక్సర్లు), నికోల్స్ (41; 59 బంతుల్లో 5 పోర్లు) శుభారంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్ కు 93 పరుగులు జోడించారు. నికోల్స్ ను చాహల్ ఎల్బీగా పెవీలియన్‌కు పంపాడు. వన్‌డౌన్ లో వచ్చిన బ్లండెట్ (22; 25 బంతుల్లో 3 పోర్లు) ను శార్దుల్ వెనక్కి పంపాడు. ఈ దశలో భారత బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లను తీశారు. దీంతో ఓ దశలో న్యూజిలాండ్ 197-8 తో నిలిచింది. ఇక కివీస్ ఆలౌట్ కు ఎంతో టైం పట్టదని టిమిండియా ఫ్యాన్స్ భావించారు.
ఆదుకున్న టేలర్..
ఓ వైపు సహచరులంతా పెవిలియన్ కు చేరుతున్నరాస్ టేలర్ (73 నాటౌట్; 74 బంతుల్లో 5పోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశారు. బౌండరీలు బాదుతూ.. స్కోర్ బోర్డును నడిపించాడు. అతడికి పేసర్ జెమీసన్ (25; 24 బంతుల్లో 1పోర్, 2 సిక్సర్లు) చక్కని సహకారం అందిచారు. వీరిద్దరు కలిసి తొమ్మిదో వికెట్ కు అజేయంగా 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో 273 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చాహల్ 3, శార్దుల్ 2, జడేజా ఒక వికెట్ తో రాణించారు.