భారత్‌లో 80వేలు దాటిన కరోనా మరణాలు..!

By సుభాష్  Published on  15 Sep 2020 6:10 AM GMT
భారత్‌లో 80వేలు దాటిన కరోనా మరణాలు..!

భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. గత రెండు రోజులుగా కేసులు సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినా.. నిన్న దేశ వ్యాప్తంగా 10,72,845 కరోనా పరీక్షలు చేయగా, అందులో 83,808 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం నాటికి దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,30,236కు చేరింది. వీరిలో ఇప్పటికే 38 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, మరో 9 లక్షల 90వేల యాక్టివ్‌లో ఉన్నాయి. ఇక దేశంలో మరణాల సంఖ్య మరింత ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్క రోజే మరో 1054 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 80,776కు చేరింది. అయితే మరణించిన వారిలో దాదాపు 70 శాతానికి పైగా ఇతర ఆరోగ్య సమస్యలున్నవారే ఉన్నారని కేంద్రం తెలిపింది.

ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 78శాతానికి చేరడం కొంత ఉపశమనం కలిగించే విషయమనే చెప్పాలి. మరణాల రేటు 1.64 శాతం ఉంది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 5 కోట్ల 83 లక్షలకుపైగా కరోనా పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. ఇలా రోజురోజుకు మరణాలు, కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతున్నా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక రోజు తగ్గినా.. మరుసటి రోజు పెరిగిపోతున్నాయి.

గడిచిన 24 గంటల్లో..

పాజిటివ్‌ కేసులు - 83,808

మరణాలు - 1054

కోలుకున్న వారు - 79,292

మొత్తం కేసులు - 49,30,236

మొత్తం మరణాలు - 80,776

Next Story