పంత్.. ఎట్టకేలకు..

By Newsmeter.Network  Published on  16 Feb 2020 6:35 AM GMT
పంత్.. ఎట్టకేలకు..

భారత జట్టులో చోటు దక్కించుకోవడానికి ఆపసోపాలు పడుతున్నాడు భారత యువ వికెట్‌ కీపర్‌ రిషబ్ పంత్. ప్రతిభను నిరూపించుకోవడానికి చాలా అవకాశాలే దక్కాయి. అయితే నిర్లక్ష్యపు షాట్లతో తరుచుగా పెవిలియన్‌ చేరుతుండడం.. అదే సమయంలో కేఎల్‌ రాహుల్ అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు కీపింగ్‌లో రాణించడంతో పంత్‌కు టీమ్‌లో చోటు దక్కడం లేదు. కాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఎట్టకేటలకు బ్యాట్‌ ఝళిపించాడు రిషబ్‌పంత్. రెండో ఇన్నింగ్స్‌లో అర్థశతకంతో రాణించాడు. 65 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70 పరుగులు చేశాడు. నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రిషభ్‌ పంత్‌.. తొలుత నిలదొక్కునేందుకు ప్రయత్నించాడు. అనంతరం తనదైన శైలిలో బారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.

టెస్టు సిరీస్‌ ముందు టీమిండియాకు మంచి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ లభించింది. న్యూజిలాండ్ లెవ‌న్‌తో హామిల్ట‌న్‌లో జ‌రిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భార‌త బ్యాట్స్‌మెన్ రాణించారు. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి రోజైన ఆదివారం రెండో ఇన్సింగ్స్‌ లో భారత ఓపెనర్లు పృథ్వీ షా(39; 31 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), మయాంక్‌ అగర్వాల్‌(81 రిటైర్డ్‌ హర్ట్‌; 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు మొదటి వికెట్‌కు 72 పరుగులు చేశారు. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన శుబ్‌మాన్ గిల్ (8) మరోసారి విఫ‌ల‌మ‌వ‌డంతో 82 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో మ‌యాంక్‌తో జ‌త క‌లిసిన రిష‌బ్ పంత్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఓవైపు మ‌యాంక్ స‌మ‌యోచితంగా బ్యాటింగ్ చేస్తుంటే.. పంత్ మాత్రం వేగంగా ప‌రుగులు చేశాడు. మూడో వికెట్‌కు ఈ జంట స‌రిగ్గా వంద ప‌రుగులు జోడించింది. అర్ధ‌సెంచ‌రీ పూర్తి చేసుకున్న కాసేప‌టికే మ‌యాక్ రిటైర్డ్ హ‌ర్ట్‌గా పెవిలియ‌న్‌కు చేరాడు. ఈ ద‌శ‌లో వృద్ధిమాన్ సాహా (30 నాటౌట్‌)తో క‌లిసి భార‌త ఇన్నింగ్స్‌ను పంత్ న‌డిపించాడు.

ఈ ప‌ర్య‌ట‌న‌లో తొలిసారి బ్యాటింగ్ చేసే అవ‌కాశం ద‌క్కించుకున్న పంత్‌.. త‌న క‌సినంతా బౌల‌ర్ల‌మీద చూపించాడు. కాసేప‌టికే అర్ధసెంచ‌రీ పూర్తి చేసుకున్న పంత్‌ కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. ర‌విచంద్ర‌న్ అశ్విన్ (16 నాటౌట్‌)తో క‌లిసి సాహా మ‌రో వికెట్ ప‌డ‌కుండా రోజును ముగించాడు. బౌల‌ర్ల‌లో డారైల్ మిషెల్‌కు మూడు వికెట్లు ద‌క్కాయి. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 263 ప‌రుగులు చేయ‌గా.. కివీస్ లెవ‌న్ 235 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఈ నెల 21 నుంచి కివీస్‌తో భారత్ తొలి టెస్టు ఆడనుంది.

Next Story