చినజీయర్ పుట్టిన రోజు వేడుకల్లో సీఎం కేసీఆర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 12:59 PM GMT
చినజీయర్ పుట్టిన రోజు వేడుకల్లో సీఎం కేసీఆర్

హైదరాబాద్: ఒక పక్క ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే.. మరో వైపు తనకేమీ పట్టనట్టుగా సీఎం కేసీఆర్‌ చినజీయర్‌ స్వామి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడాన్ని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. కనీస ప్రయాణ సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. సీఎం కేసీఆర్‌ జీయర్‌ స్వామి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడంపై కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 24 రోజులకు చేరుకుంది. సమ్మెపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం వెనక ఉన్న కారణంమేంటో తెలియరావడం లేదు.

వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో త్రిదండి చినజీయర్‌స్వామి తిరునక్షత్రోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. స్వామి వారి 64వ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా కేసీఆర్‌ దంపతులు జీయర్‌స్వామీజీ జన్మదిన వేడుకల్లో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా పెదజీయర్‌ స్వామీజీపై రచించిన 'సత్య సంకల్ప పుస్తకాన్ని జీయర్‌ స్వామీజీ కేసీఆర్‌కు అందజేశారు. ఐదురోజుల పాటు చినజీయర్‌ స్వామి తిరునక్షత్రోత్సవ వేడుకలను ఘనంగా జరపనున్నారు. ఇద్దరు వేద పండితులకు జీయర్‌ పురస్కారం అందజేశారు. కమలానంద భారతి స్వామీజీ, మైసూరు అవధూత దత్త పీఠాధిపతి సచ్చిదానం స్వామీజీ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మై హోమ్స్‌ గ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వరరావు, ఇతర ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

Next Story