రెండు రోజుల భారత పర్యటన కోసం వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ సోమవారం అహ్మదాబాద్‌లోని కొత్తగా నిర్మించిన మొతెరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో పాల్గొని .. ప్రసంగించారు. భారతదేశ విశిష్టతను కొనియాడారు. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ టెందూల్కర్‌, విరాట్‌ కోహ్లీ పేర్లను ప్రస్తావించారు. అయితే వారి పేర్లను ఉచ్చరించడంతో ట్రంప్‌ విఫలమయ్యారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో మేటి ఆటగాళ్లైన సచిన్‌, విరాట్‌ భారతీయులేనని, గొప్ప క్రికెటర్లను భారత్ అందించిందని ట్రంప్‌ ప్రశంసించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నోటి నుంచి భారత క్రికెటర్ల పేర్లు రావడంతో క్రికెట్‌ అభిమానులు సంతోషించారు. అయితే.. వారి పేర్లను తప్పుగా ఉచ్చరించడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. సచిన్‌ అని పిలవడానికి బదులు ‘సొ- చిన్‌’ తెందూల్కర్‌ అని, విరాట్‌ కోహ్లీ కి బదులు ‘విరాట్‌ కోలీ’ అని పలికారు. దీంతో నెటీజన్లు ట్రంప్‌ ఉచ్చారణపై ట్రోలింగ్‌ మొదలు పెట్టారు.

ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ కూడా ట్రంప్‌ పై వ్యంగాస్త్రాలు విసిరాడు. లెజెండ్స్‌ పేరును పలికే ముందు ట్రంప్‌ తగిన రీసెర్చ్‌ చేయాలని ట్రంప్‌ కు పీటర్సన్‌ సూచించాడు. ఐసీసీ కూడా ట్రంప్‌ను ట్రోల్‌ చేసింది. సచిన్‌ పేరును ప్రస్తావిస్తూ.. ‘sach, such, satch, sutuch, sooch’ లాంటి పేర్లు ఎరికైనా తెలుసా..? అని ఐసీసీ అభిమాలను ప్రశ్నించింది. ప్రస్తుతం ఐసీసీ ట్వీట్‌ తెగ హల్‌చల్ చేస్తోంది.

 

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.