భద్రత కల్పించకున్నా శబరిమల ఆలయంలోకి వెళ్తాను..!
By Newsmeter.Network
కేరళ: శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి వెళ్లితీరతామని మహిళా సంఘం నాయకురాలు తృప్తి దేశాయ్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా.. శబరిమలను దర్శిస్తామని, అది మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. మహిళలు ఆలయాన్ని దర్శించవచ్చు అని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే కేరళలోని కొచ్చి నగరానికి తృప్తి దేశాయ్ చేరుకున్నారు. అయితే ఈ మేరకు ప్రభుత్వాన్ని, పోలీసులను తమకు భద్రత ఇవ్వాలని అడుగుతున్నట్టు చెప్పారు. అలాగే అధికారులు తనకు రక్షణ కల్పించినా.. కల్పించకపోయినా.. ఆలయప్రవేశం చేసి తీరుతామన్నారు. మరోవైపు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు మహిళా ఉద్యమ నేత తృప్తి దేశాయ్‌తో పాటు మొత్తం ఆరుగురు మహిళలు శబరిమల బయలుదేరినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో కొచ్చి ఎయిర్ పోర్టులో వీరిని అడ్డుకున్న కొందరు వ్యక్తులు బృందం.. బిందు అమ్మిని అనే మహిళపై కారంపొడి కల్పిన నీటిని చల్లినట్టు ఆమె ఆరోపించారు. అనంతరం అయ్యప్పస్వామి ఆలయంలోకి వెళ్లొద్దని తమతో వాగ్వాదానికి దిగారని తెలిపారు. బిందును ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. తృప్తి దేశాయ్ బృందాన్ని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తరలించారు.
ఇదిలా ఉంటే.. భక్తులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో మహిళలను ఆలయంలోకి అనుమతించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా కాకుండా మహిళలు ఆలయ ప్రవేశం చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకుని తీరుతామంటున్నారు. మరోవైపు తృప్తి దేశాయ్ ఇప్పటికే ఆలయంలో అడుగుపెడతామని.. ప్రకటించడంతో పోలీసులు భద్రతను పెంచారు. భక్తులకు వారికి మధ్య ఘర్షణలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. అడుగగుడునా తనిఖీలు చేసిన తర్వాతే భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు.