Hyderabad: రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా..? జైలు శిక్ష తప్పదు

హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ సమస్య ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  8 Aug 2024 3:28 AM GMT
wrong route, driving,  traffic, fines,  jail,

 Hyderabad: రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా..? జైలు శిక్ష తప్పదు

హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ సమస్య ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక కొన్ని ప్రాంతాల్లో చిన్న పాటి గమ్యస్థానానికి లాంగ్ యూటర్న్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వాహనదారులు కొందరు అంత దూరం ఏం వెళ్తాంలే అని రాంగ్‌రూట్‌లో వెళ్తుంటారు. అలాంటి వారికి ట్రాఫిక్ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. అలాంటి వారిపై ఎఫ్‌ఐఆర్‌ తప్పదంటున్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని చెబుతున్నారు. ఒక వేళ ప్రమాదాలకు కారణమైతే జైలు శిక్ష కూడా తప్పదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.

ప్రతిరోజూ సగటున 10 నుంచి 20 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం ఒకరిద్దరు మృత్యువాత పడుతున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌తో పాటు ర్యాష్‌ డ్రైవింగ్‌, సిగ్నల్‌ జంపింగ్‌, రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ వంటి ఉల్లంఘనలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. రాంగ్‌రూట్‌ డ్రైవింగ్‌ వల్ల గతేడాది 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయపడ్డారు. ఈ సంవత్సరం ఒకరు చనిపోగా, 128మంది గాయపడ్డారు. బుధవారం ఒక్కరోజు నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో రాంగ్‌రైట్‌ డ్రైవింగ్‌ చేస్తూ 688 మంది వాహనదారులు పట్టుబడ్డారు. వీరిలో అధికం టూవీలర్ వాహనదారులే.

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా రాంగ్‌రూట్‌ డ్రైవింగ్ వల్లే జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అందుకే కొత్తగా రూల్స్‌ను అమలు చేస్తున్నట్లు ఎప్పారు. రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ అనేది మోటర్‌ వెహికిల్‌ యాక్ట్‌ 119/177, 184 సెక్షన్ల ప్రకారం నేరం. వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్ చెప్పారు. ఇక వారి వల్ల రోడ్డుప్రమాదం సంభవిస్తే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఆయన వెల్లడించారు. కొన్ని సమయాల్లో జరిమానా కూడా పడే అవకాశం ఉందన్నారు.

Next Story