ప్రాణం కాపాడిన పోలీస్‌ని కలిసి కన్నీరు పెట్టుకున్న మహిళ

ఓ మహిళ బస్సులో వెళ్తుండగా.. పదేళ్ల క్రితం తన ప్రాణం కాపాడిన పోలీస్‌ను చూసింది. దాంతో.. బస్సు దిగి పరుగు తీసింది.

By Srikanth Gundamalla  Published on  27 Aug 2023 1:30 PM GMT
Woman, ACP Ravinder, saved her life,

 ప్రాణం కాపాడిన పోలీస్‌ని కలిసి కన్నీరు పెట్టుకున్న మహిళ

హైదరాబాద్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ మహిళ బస్సులో ప్రయాణం చేస్తుంది. ఉన్నట్లుండి బస్సుని ఆపాలని డ్రైవర్‌ను కోరింది. ఆ తర్వాత గబగబా బస్సు దిగి రోడ్డుమీద పరుగెత్తడం ప్రారంభించింది. ఆమెను చూసిన వారంతా ఏదో మర్చిపోయి ఉంటుందని అనుకున్నారు. తిరిగి వస్తుందిలే అనుకున్నారు. కానీ.. ఆమె పరిగెత్తుకుంటూ పోలీసుల దగ్గరకు వెళ్లింది. దాంతో.. బస్సులో ఉన్నవారు సహా.. ఆమెను గమనించినవారంతా షాక్‌ అయ్యారు.

సికింద్రాబాద్‌లోని ఆర్పీ రోడ్‌లో జరిగింది ఈ ఘటన. ఆర్పీ రోడ్‌లో బందోబస్తు నిర్వహిస్తోన్న మహంకాళి ఏసీపీ రవీందర్‌ను కలిసేందుకే మహిళ బస్సులో నుంచి దిగి పరిగెత్తింది. రవీందర్‌ 2014లో ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న సమయంలో మహిళ ప్రాణం కాపాడట. అందుకే ఆయన్ని చూడగానే కలవాలని.. కృతజ్ఞతలు తెలపాలని పరుగు తీసింది. కార్వాన్‌కు చెందిన కవిత అనే మహిళ 2014లో రోడ్డుపై అనారోగ్యంతో పడిపోయింది ఉంది. దాంతో.. ఆమెను చూసిన రవీందర్‌ వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత సొంత డబ్బులతో వైద్యం చేయించాడు.

అనారోగ్యం నుంచి కోలుకున్నాక తన ప్రాణం కాపాడిన పోలీసు కోసం వెతికింది సదురు మహిళ. కానీ.. ఏసీపీ రవీందర్ ఎక్కడున్నారో తెలియలేదు. చివరకు ఆదివారం ఆమె బస్సులో వెళ్తున్న సమయంలో ఏసీపీ రవీందర్‌ను చూసి గుర్తు పట్టింది. తన ప్రాణాలు కాపాడిన దేవుడిని కలిసేందుకు బస్సులో నుంచి దిగి పరుగు తీసింది. పదేళ్ల క్రితం జరిగిన ఘటనను ఏసీపీకి గుర్తు చేసింది. ఆ తర్వాత ఆయనకు దండం పెట్టి... తాను ఇవాళ బతికి ఉన్నానంటే కారణం మీ సేవా గుణమే అంటూ కృతజ్ఞత తెలిపింది. కొన్నేళ్ల తర్వాత తాను దైవంగా భావిస్తున్న వ్యక్తి కనిపించడంతో కన్నీరుపెట్టుకుంది. మీరు నా దేవుడంటూ రవీందర్‌ను పట్టుకుని ఏడ్చింది. రవీందర్‌ చాలా మంచి వ్యక్తి అని.. ఆయన మరింత ఉన్నతస్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పింది. అంతేకాదు.. ఏసీపీ రవీందర్‌ కోసం ఒక వెండి రాఖీ తీసుకొచ్చి కడతానని ఆనందం వ్యక్తం చేసింది. ఆమె కృతజ్ఞతను చూసిన మిగతా పోలీసులు, స్థానికులు ఆశ్చర్యపోయారు. చివరకు ఏసీపీ రవీందర్‌ నెంబర్‌ తీసుకుని సదురు మహిళ అక్కడి నుంచి ఆనందంగా ముందుకు కదిలింది.

Next Story