మహంకాళి బోనాలు: రంగంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల్లో భాగంగా రంగం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
By Srikanth Gundamalla Published on 10 July 2023 5:01 AM GMTమహంకాళి బోనాలు: రంగంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
సికింద్రాబాద్ మహంకాళి బోనాల సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల్లో భాగంగా రంగం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రంగం కార్యక్రమం నిర్వహించడం ప్రతిఏటా ఆనవాయితీగా వస్తోన్న విషయం అందరికీ తెలింసిందే. దీంట్లో అమ్మవారి ఆలయంలో ఈసారి కూడా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్వర్ణలత చెప్పిన భవిష్యవాణిని విన్నారు.
ప్రతిఏటా తెలంగాణ ప్రజల భవిష్యవాణి రంగం కార్యక్రమంలో స్వర్ణలత చెబుతారు. మాతంగి స్వర్ణల పచ్చి కుండలపై నిలబడి భవిష్యవాణి చెప్పారు. 'ఈ ఏడాది భక్తులు చేసిన పూజలను ఎలాంటి లోపం లేకుండా సంతోషంగా అందుకున్నా. గతేడాదికి నాకు మా ఇచ్చి ఎందుకు మర్చిపోయారు. కావాల్సినంత బలాన్ని ఇచ్చాను. మీతోనే నేను ఉంటాను. వర్షాలు ఆలస్యమైనా తప్పనిసరిగా వస్తాయి. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దు. కొంచెం ఒడిదుడుకుడు ఉంటుంది. అగ్నిప్రమాదాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. నా వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరినీ సుఖసంతోషాలతో చూసుకునే భారాన్ని మోస్తాను. ఐదు వారాల పాటు నాకు సాక పెట్టాలి. నైవేద్యం, టెంకాయ కొట్టాలి. ప్రతీ గడపను కాపాడే బాధ్యత నేనే తీసుకుంటాను. ఏది బయటపెట్టాలో.. ఏది బయట పెట్టకూడదో నాకు మాత్రమే తెలుసు. ఇవన్నీ కడుపులో దాచుకునేది నేనే. తప్పనిసరిగా నాలోనే దాచుకుంటాను. మీరు చేసే పూజలను అందుకుంటాను. వచ్చే ఏడాది అన్ని పూజలు జరిపించండి. మీరేం భయపడొద్దు.. మిమ్మల్ని కాచుకుని నేనున్నా' అని స్వర్ణల మహంకాళి రూపంలో తెలంగాణ ప్రజల భవిష్యవాణి వినిపించారు.
రంగం కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. గతేడాది ప్రభుత్వంపై, అధికారులపై అమ్మవారు కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే. తన నిధులు కాజేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఉజ్జయినీ బోనాల్లో భాగంగా పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఆకర్షణీయంగా నిలుస్తాయి. సాయంత్రం పొట్టేళ్లతో పలహారం బండ్లు, ఊరేగింపు జరుగుతుంది.