వీడిన తిరుపతిరెడ్డి మిస్సింగ్ మిస్టరీ..మైనంపల్లిపై సంచలన ఆరోపణలు
స్థిరాస్తి వ్యాపారి తిరుపతి రెడ్డి ఎట్టకేలకు ప్రత్యక్షమయ్యారు. ఎమ్మెల్యే మైనంపల్లిపై సంచలన ఆరోపణలు చేశారు.
By Srikanth Gundamalla Published on 18 July 2023 8:30 PM ISTవీడిన తిరుపతిరెడ్డి మిస్సింగ్ మిస్టరీ..మైనంపల్లిపై సంచలన ఆరోపణలు
గత ఆరు రోజుల క్రితం అదృశ్యమైన జనగామ జిల్లాకు చెందిన స్థిరాస్తి వ్యాపారి తిరుపతి రెడ్డి ఎట్టకేలకు ప్రత్యక్షమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి డీసీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన తిరుపతిరెడ్డి ఎమ్మెల్యే మైనంపల్లిపై సంచలన ఆరోపణలు చేశారు.
తనని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కిడ్నాప్ చేసి చంపాలని చూసినట్లు ఆరోపణలు చేశాడు తిరుపతిరెడ్డి. ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లినప్పుడు కూడా తనని కొందరు వెంబడించారని చెప్పుకొచ్చారు. దాంతో.. భయంతోనే అక్కడి పారిపోయానని చెప్పారు. ఆటోలో ఎక్కగానే తనని మైనంపల్లి అనుచరులు గమనించారని.. ఫాలో చేశారని చెప్పారు. తనని చంపేందుకు కూడా ప్రయత్నించారని అన్నారు. ఎలాగోలా వాళ్ల దగ్గర నుంచి తప్పించుకుని విజయవాడ పారిపోయినట్లు చెప్పారు తిరుపతిరెడ్డి. ఈ క్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. గతంలో ఈ విషయంపై గతంలో పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. అవతలి వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో ఫిర్యాదు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు అడ్వకేట్ సలహా మేరకు ఇవాళ డీసీపీ కార్యాలయానికి వచ్చానని తిరుపతిరెడ్డి వెల్లడించారు.
తనను ఎంత బెదిరించినా స్థలం కబ్జా కానివ్వనని తిరుపతిరెడ్డి అన్నారు. గత గురువారం మధ్యాహ్నం కారులో అల్వాల్‌లోని తహసీల్దార్ ఆఫీస్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పిన తిరుపతిరెడ్డి కనిపించకుండా పోయారు. ఆ తర్వాత ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. తిరుపతిరెడ్డి ఆటో ఎక్కుతున్న దృశ్యాలు కనిపించడంతో.. కిడ్నాప్ కేసా? కాదా అనేది తెలియడం లేదని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం తిరుపతిరెడ్డి ప్రత్యక్షం కావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక తిరుపతిరెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే మైనంపల్లి ఇంకా స్పందించలేదు.