1908లో 150 మందిని కాపాడిన చింతచెట్టు..చరిత్రలో నిలిచిన వృక్షం
విపత్కర పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రజలకు నేను ఉన్నానంటూ ఓ చెట్టు అండగా నిలిచింది.
By Srikanth Gundamalla Published on 26 Sep 2023 12:36 PM GMT1908లో 150 మందిని కాపాడిన చింతచెట్టు..చరిత్రలో నిలిచిన వృక్షం
1908లో సెప్టెంబర్ 27, 28వ తేదీలు హైదరాబాద్‌కు చీకటి అధ్యాయాలు. 430కిపైగా ఏళ్లు అవుతున్నా.. మరిచిపోలేని చేదుజ్ఞాపకాలను మిగిల్చిన రోజులు. అప్పటి వరకు మహానగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ఊహించని జలప్రళయం విలవిల్లాడించింది. ఏకంగా 15వేల మంది ప్రాణాలను తీసింది. అయితే.. అప్పట్లో మూసీ పరివాహక ప్రాంతంలోనే హైదరాబాద్ విస్తరించి ఉంది. 1908లో కురిసిన వర్షాలతో మూసీ నది ఉప్పొంగింది. 2సెప్టెంబర్ చివరి రోజుల్లో మరింత పెరిగి 26, 27 తేదీల్లో జలప్రళయంగా మారింది. 27న ఉదయం 2 గంటలకు హెచ్చిరికలు జారీ చేసినా ఉపయోగం లేకపోయింది. వరద పోటెత్తడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు ప్రజలు. చాలా మంది వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. 15వేల మంది మరణించి ఉంటారని అప్పట్లో అంచనా వేశారు.
అయితే.. అలాంటి విపత్కర పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రజలకు నేను ఉన్నానంటూ ఓ చెట్టు అండగా నిలిచింది. వరదల్లో కొట్టుకుపోతున్న వారు దాదాపు 150 మంది ఈ చెట్టుని పట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నారు. అంతమంది ప్రాణాలు నిలబెట్టిన చింతచెట్టు ఇప్పటికీ ఉస్మానియా దవాఖాన ఆవరణలో ఠీవీగా నిల్చుని ఉంది. ఈ చెట్టుకు ఎంతో చరిత్ర ఉందని.. వందల మంది ప్రాణాలు కాపాడిన ఈ చింతచెట్టు చరిత్రలో నిలిచిపోయిందని చెబుతుంటారు. అయితే.. పెద్దసంఖ్యలో ప్రాణాలను కాపాడిన ఈ చెట్టును గుర్తుచేసుకుంటూ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్, సెంటర్ ఫర్ దక్కన్ స్టడీస్, దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ సంస్థల ఆధ్వర్యంలో మూసీ వరద మృతులకు నివాళిగా అదే చింతచెట్టు కింద స్మారక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఈ స్మారక సమావేశం ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ సమావేశం ద్వారా వారిని గుర్తు చేసుకోవడమే కాకుండా.. ఇలాంటి చారిత్రక వారసత్వ సంపదలను భావితరాలకు అందించడం కోసం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.