మహిళలను వేధించే నిందితుల ప్రవర్తనపై 6 నెలల ప్రత్యేక నిఘా
మహిళలను వేధించిన కేసుల్లో నిందితులుగా ఉన్నవారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు చెప్పారు రాచకొండ సీపీ సుధీర్‌బాబు.
By Srikanth Gundamalla Published on 19 Jan 2024 6:15 PM ISTమహిళలను వేధించే నిందితుల ప్రవర్తనపై 6 నెలల ప్రత్యేక నిఘా
మహిళలను వేధించిన కేసుల్లో నిందితులుగా ఉన్నవారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు చెప్పారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు. లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్ వంటి వేధింపులు చేసి కేసుల్లో నిందితుల్లో ఉన్నవారు.. సదురు మహిళా బాధితులను మరోసారి ఎలాంటి వేధింపులు, భయబ్రాంతులకు గురి చేయకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈమేరకు మహిళా సంరక్షణ నిఘా రిజిస్టర్‌ను నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కార్యాలయంలో సీపీ సుధీర్‌బాబు విడుదల చేశారు.
బాధిత మహిళలకు నిందితుల నుంచి తదుపరి కక్షపూరిత వేధింపులు, దాడులు వంటివి చేయకుండా ఉండేందకు.. నిందితుల ప్రవర్తన, కార్యకలాపాలపై మహిళా సంరక్షణ నిఘా రిజిస్టర్‌ను ప్రారంభించారు. ఈ రిజిస్టర్ ద్వారా ఆరు నెలల పాటు వారిపై నిఘా ఉంటుందని వెల్లడించారు. ఈ రిజిస్టర్ ద్వారా గతంలో లైంగిక నేరాలకు పాల్పడిన నేరస్తులు మళ్లీ అలాంటి నేరాలు లేదా ఇతర నేరాలకు పాల్పడకుండా నిఘా పెడుతున్నామని సీపీ సుధీర్‌బాబు చెప్పారు.
అయితే.. ఈ నిఘా పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి లేదంటా సెక్టార్ ఎస్‌ఐల ఆధ్వర్యంలో రహస్యంగా నిర్వహించబడుతుందని సీపీ తెలిపారు. బాధితులకు, లేదంటే వారి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటామని చెప్పారు. ఇక అవసరమైన సమయంలో వ్యక్తిగతంగా భద్రతాపరమైన తోడ్పాటు కూడా అందిస్తామని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. రాచకొండ పరిధిలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. షీటీమ్స్ ద్వారా డెకాయ్ ఆపరేషన్లు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాచకొండ సీపీ చెప్పారు. ఇక మహిళ పట్ల నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ సుదీర్‌బాబు హెచ్చరించారు.