సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశృతి
మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు.
By Srikanth Gundamalla Published on 10 July 2023 11:09 AM ISTసికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశృతి
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు.
హైదరాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆకాశ్‌సింగ్ (27) అనే వ్యక్తి.. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లాడు. భక్తులు ఎక్కువగా ఉండటంతో బయటే నిలబడ్డాడు. హైదరాబాద్‌లో ఆ సమయంలో వర్షం కూడా పడింది. ఆకాశ్ సింగ్ అనుకోకుండా విద్యుత్ స్తంభాన్ని తగిలాడు. వర్షం పడిన కారణంగా అతినికి విద్యుత్ షాక్ తగిలింది. అంతే అక్కడే గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు. కార్వాన్ ప్రాంతానికి చెందిన ఆకాశ్ సింగ్ బేగంబాజర్‌లో సేల్స్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు.
కాగా.. వ్యక్తి మరణించాడన్న వార్త తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినా విద్యుత్‌శాఖ అధికారులు స్పందించలేదు. గతంలోనూ ఓ వ్యక్తి ఇదే తరహాలో విద్యుత్‌షాక్‌తో అమ్మవారి ఉత్సవాల్లో మరణించాడు. మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో.. ఆకాశ్ సింగ్ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.