హైదరాబాద్‌లో వరదలపై మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ
హైదరాబాద్‌లో వర్షాలు, వరదలు.. చేపట్టాల్సిన సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
By Srikanth Gundamalla Published on 27 July 2023 1:48 PM ISTహైదరాబాద్‌లో వరదలపై మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాలు, వరదలు సంభవించడంతో నగరం విలవిల్లాడుతోంది. ప్రతి గల్లీ ఏరులైపారుతోంది. ప్రజలు ఇంటి నుంచి బయట అడుగుపెట్టలేకపోతున్నారు. రహదారులు కాలువల్లా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో వర్షాలు, వరదలు.. చేపట్టాల్సిన సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం తడిసి ముద్దయ్యిందని, వరదలతో ప్రజలు సతమతం అవుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల గోసను పట్టించుకోకుండా ఉండటం సబబు కాదని అన్నారు. పుట్టినరోజులు చేసుకుంటూ ప్రజలను మీ చావు మీరు చావండి అంటూ వదిలేసి నిసుగ్గుగా బాధ్యతల నుంచి పారిపోతున్నారని విమర్శించారు రేవంత్‌రెడ్డి. కేటీఆర్, కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో సేదతీరుతూ.. ప్రజలను మాత్రం వరదల్లో వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సందర్భం వచ్చినప్పుడల్లా హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి తండ్రి, కొడుకులు పోటి పడుతుంటారని రేవంత్‌రెడ్డి అన్నారు. యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తోందని ఉద్దెర ముచ్చట్లు చెప్తారని గుర్తు చేశారు. ప్రపంచ దేశాల సంగతేమో గానీ నగర ప్రజలే బయటకు రావడానికి ఒకటికి పది సార్లు ఆలోచించుకునే దుస్థితి ఉందని అన్నారు. ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో అని ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుంటూ తిరిగాల్సిన పరిస్థితిని కల్పించారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ నాయకుల అసమర్థత తేటతెల్లం అయ్యిందని.. హైదరాబాద్ నగరం ఎలా అభివృద్ధి చెందిందో జనాలకు అర్థమైపోయిందని రేవంత్‌రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని నరక కూపంగా మార్చారని విమర్శించారు రేవంత్‌రెడ్డి. గత 9 ఏళ్లుగా నగరంలో సౌకర్యాల కల్పన, ప్రజలకు మేలు జరిగే దిశగా ఒక్క చర్య చేపట్టలేదన్నారు. ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నానా యాతన పడుతున్నారని, పది నిమిషాల ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతుందని రేవంత్ తెలిపారు.ఫ్లైఓవర్ల కింద అండర్ పాస్ లు నీళ్ళు నిండిపోయి వాహనాలు వెళ్ళలేక జనాలు ఇబ్బందిపడుతున్నారు అని చెప్పారు. భారీ వర్షాలకే నగరం అతలాకుతలం అయ్యింది, ముంబైలో మాదిరి కుండపోత వర్షాలు పడితే పరిస్థితి ఏంటా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్ నగరంలో ఇంత విధ్వంసం జరుగుతుంటే కేటీఆర్ కు కనీసం సమీక్ష చేసే సమయం లేదా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అయిన కూడా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదని అన్నారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజల సహాయం కోసం హాహాకారాలు చేస్తున్నా.. పట్టించుకునే తీరిక లేదని అన్నారు రేవంత్‌రెడ్డి. నగరంలో మునుపెన్నడూ లేనంతగా వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీనంతటికీ కారణం బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజల కష్టాలను తీర్చే ప్రయత్నాలు చేయాలని లేఖలో రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. లేదంటే ఈ నెల 28న కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని రేవంత్‌రెడ్డి అన్నారు.