సీపీని కలిసి క్షమాపణలు కోరిన పంజాగుట్ట పోలీసు జంట
పంజాగుట్ట పీఎస్‌లో ప్రీవెడ్డింగ్ షూట్ ద్వారా వివాదాన్ని సృష్టించిన పోలీస్ జంట సీపీని కలిసి క్షమాపణలు కోరారు.
By Srikanth Gundamalla Published on 23 Sept 2023 8:24 AM ISTసీపీని కలిసి క్షమాపణలు కోరిన పంజాగుట్ట పోలీసు జంట
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ జంట ఇటీవల ప్రీవెడ్డింగ్ షూట్ స్టేషన్‌లో నిర్వహించుకున్నారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యిన విషయం తెలిసిందే. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఖాకీ డ్రెస్సుల్లో, పోలీసుల వాహనాలను వాడుకుంటూ షూట్ చేయటంపై తీవ్ర దుమారం చెలరేగింది. ఈ వీడియోపై పలువురు విమర్శలు చేస్తూ కామెంట్స్ చేశారు. యూనిఫాంకు గౌరవం ఇవ్వాలని.. బాధ్యతగల పదవిలో ఉన్నప్పుడు అలాగే మెలగాలంటూ హితవు పలికారు. అయితే.. ఈ ప్రీవెడ్డింగ్ షూట్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడం.. వివాదం ముదరడంతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కూడా స్పందించారు. ఈసారికి వదిలేస్తున్నామని.. కానీ ఇలాంటి వాటి గురించి ముందే సమాచారం ఇస్తే అనుమతి ఇచ్చేవారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వారికి శుభాకాంక్షలు తెలిపారు కూడా. దాంతో.. ఈ వివాదానికి తెరపడినట్లు అయ్యింది.
కాగా.. తాజాగా సీపీ సీవీ ఆనంద్‌ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ప్రీవెడ్డింగ్ షూట్ చేసుకున్న పోలీస్ జంట ఎస్సై భావన, ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ కలిశారు. సీపీకి ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పారు. పోలీస్ శాఖను కాస్త ఇబ్బంది పెట్టామని.. అందుకు తమను క్షమించాలని సీపీ దగ్గర విన్నవించారు కొత్త జంట. ఈ సందర్భంగా పోలీసు నవ దంపతులను సీపీ సీవీ ఆనంద్ ఆశీర్వదించారు. పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. మొన్న జరిగిన ఫ్రీ వెడ్డింగ్ షూట్‌పై స్పందిస్తూ.. వ్యక్తిగత వేడుకలకు యూనిఫాం గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సీపీ సీవీ ఆనంద్ గుర్తు చేశారు. జీవితకాలం ప్రేమతో కలిసి ఉండాలని ఈ సందర్భంగా సీపీ ఆనంద్ ఆకాంక్షించారు.