కరోనా వ్యాక్సిన్‌పై శాస్త్రవేత్తలతో మోదీ సమీక్ష.. మోదీ ఏమన్నారంటే

Modi visit bharat biotech Review on corona vaccine .. కరోనా వ్యాక్సిన్‌పై శాస్త్రవేత్తలతో మోదీ సమీక్ష.. మోదీ ఏమన్నారంటే

By సుభాష్  Published on  28 Nov 2020 9:50 AM GMT
కరోనా వ్యాక్సిన్‌పై శాస్త్రవేత్తలతో మోదీ సమీక్ష.. మోదీ ఏమన్నారంటే

ప్రధాని నరేంద్రమోదీ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ను సందర్శించి పరిశీలించారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన మోదీ.. నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చేరుకున్నారు. అక్కడ జైడస్‌ బయోటెక్‌ పార్క్‌ను సందర్శించారు. అనంతరం అహ్మదాబాద్‌ నుంచి హైదరాబాద్‌ హకీంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి నేరుగా కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసే భారత్‌ బయోటెక్‌కు చేరుకున్నారు. భారత్‌ బయోటెక్‌లో వ్యాక్సిన్‌ తయారీ, పురోగతిపై సందర్శించి, అనంతరం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌కు బయలుదేరారు. కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌పై ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ భారత్‌ బయోటెక్‌ శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తిపై భారత్‌ బయోటెక్‌ యాజమాన్యం, శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు.

కాగా, ప్రభుత్వం-ప్రైవేటు భాగస్వామ్యంలో ఐసీఎంఆర్‌, భారత్‌ బయోటెక్‌ సంయుక్తంగా కొవాగ్జిన్‌ టీకాను అందుబాటులోకి తీసుకువస్తోంది. దాదాపు గంట పాటు ప్రధాని మోదీ శాస్త్రవేత్తలతో చర్చించారు. ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్న వ్యాక్సిన్‌.. ఎప్పటిలోగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని మోదీ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్‌ తయారీ ఎంత వరకు వచ్చిందనే విషయాన్ని మోదీ ఆరా తీశారు. వ్యాక్సిన్ ఉత్పత్తి, తయారీ గురించి మోదీకి వివరించారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని మోదీ అన్నారు. శాస్త్రవేత్తల కృషికి మోదీ అభినందించారు. వ్యాక్సిన్‌ తయారీకి మరింత కృషి చేయాలని మోదీ సూచించారు.

Next Story
Share it