కోకాపేట భూముల వేలంలో రికార్డు.. ఎకరానికి రూ.100 కోట్లు
కోకాపేట నియోపోలీస్ లే అవుట్ భూముల వేలంలో రికార్డు ధర పలికింది. ఎకరం ధర ఏకంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటింది.
By Srikanth Gundamalla Published on 3 Aug 2023 7:47 PM ISTకోకాపేట భూముల వేలంలో రికార్డు.. ఎకరానికి రూ.100 కోట్లు
హైదరాబాద్: కోకాపేట నియోపోలీస్ లే అవుట్ భూముల వేలంలో రికార్డు ధర పలికింది. అత్యధిక ధరతో ఆల్ టైమ్ రికార్డుని నెలకొల్పుతున్నాయి. గురువారం నిర్వహించిన వేలంలో భూమలు భారీ ధరకు అమ్ముడుపోయాయి. పదో నెంబర్ ప్లాట్‌లో ఎకరం ధర ఏకంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటింది. ఏపీఆర్-రాజ్‌పుష్ప కంపెనీల మధ్య హోరాహోరీగా బిడ్డింగ్ కొనసాగింది. ఇక ప్లాట్ నెంబర్ 9లో ఎకరం భూమి రూ.76.50 కోట్లకు అమ్ముడుపోయింది.
కోకాపేట భూముల్లోని నియోపోలీస్ లే అవుట్‌లోని 6,7,8,9, 10, 11, 12, 13, 14 ప్లాట్లకు హెచ్‌ఎండీఏ వేలం నిర్వహించింది. ప్లాట్ నెంబర్ 10లో 3.60 ఎకరాలు ఉండగా.. ఎకరాకు రూ.100.25 కోట్లు పలికింది. ఈ ఒక్క ప్లాట్‌కే రూ.360 కోట్ల ఆదాయం వచ్చింది. దాంతో.. హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక భూమి రేటుగా భావిస్తున్నారు అధికారులు. ఇక అంతకుముందు తొమ్మిదో ప్లాట్‌లోని 3.60 ఎకరాల భూమిలో ఎకరాకు రూ.76.5 కోట్ల వేలం పలికింది. 9 ప్లాట్ వేలంతో మొత్తం రూ.275.4 కోట్లు వచ్చాయి.
వేలం నిర్వహించిన ప్లాట్ల వివరాలు:
ప్లాట్ నెంబర్ 6లో 7 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 7లోని 6.55 ఎకరాలు, ప్లాట్‌నెంబర్ 8లోని 0.21 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 9లోని 3.60 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 10లోని 3.60 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 11లోని 7.53 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 14లోని 7.34 ఎకరాలు. మొత్తంగా 45.33 ఎకరాలకు హెచ్‌ఎండీఏ వేలం వేసింది. నియో పోలిస్ ఫేజ్-2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 1,532.50 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ప్రభుత్వం కనీస ధర రూ.35 కోట్లు నిర్ణయించింది. కోకాపేట భూముల్లో గజం ధర సరాసి రూ.1.5 లక్షలు పలికింది. 11, 14 ప్లాట్లకు వేలం జరుగుతోంది. ఈ 45 ఎకరాల్లో(45.33 ఎకరాలు) ఉన్న ఏడు ప్లాట్‌లను విక్రయించడం ద్వారా రూ.2,500 కోట్ల వరకు సమీకరించుకోవాలని హెచ్‌ఎండీఏ భావిస్తోంది.