ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
ఖైరతాబాద్ మహాగణపతికి ఎంతో ప్రత్యేకత ఉంది.
By Srikanth Gundamalla
ఖైరతాబాద్ మహాగణపతికి ఎంతో ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ మాత్రమే కాదు.. ఇతర ప్రాంతాల నుంచి ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు. మహాగణపతి దగ్గర ప్రతి సంవత్సరం చాలా మంది భక్తులు డబ్బులు హుండీలో వేస్తూ ఉంటారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం రూ. 70 లక్షలు వచ్చింది. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ. 40 లక్షలు వచ్చాయి. ఖైరతాబాద్‌లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొదటిసారి హుండీల లెక్కింపు చేపట్టారు. పది రోజుల్లో నగదు రూపంలో ఈ ఆదాయం సమకూరినట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.
ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి చూడడానికి భక్తులు నవరాత్రులు మొదలైన దగ్గర నుండి పదో రోజు వరకు లక్షల్లో వెళ్లి దర్శనం చేసుకున్నారు. గణనాథుని చూడ్డానికి ఉదయం నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులు తండోప తండాలుగా విచ్చేశారు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా గణపతయ్యను దర్శించుకున్నారని సమాచారం. చరిత్రలో మొదటిసారి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల దగ్గర హండి లెక్కింపును పారదర్శకంగా నిర్వహించారు. కొత్త కార్యవర్గ సభ్యుల మూలంగా ఈ సారి లెక్కింపు ప్రక్రియను సవ్యంగా చేపట్టడం పట్ల స్థానిక భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. మంగళవారం ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. సోమవారం రాత్రే మహా గణపతిని పూజారులు కదిలించనున్నారు. రాత్రి 12 గంటల తర్వాత టస్కర్‌పైకి మహా గణపతిని ఎక్కించనున్నారు. రేపు మధ్యాహ్నం క్రేన్ దగ్గరికి ఖైరతాబాద్ గణపతి చేరుకోనున్నారు. 2 గంటల్లో నిమజ్జనం పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.