మూసీ వద్ద కూల్చివేతలు హైడ్రా చేపట్టడం లేదు: రంగనాథ్

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  30 Sep 2024 11:57 AM GMT
మూసీ వద్ద కూల్చివేతలు హైడ్రా చేపట్టడం లేదు: రంగనాథ్

హైడ్రా కూల్చివేతలపై తాజాగా హైకోర్టు చురకలు అంటించింది. ఆ తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అంటే కూల్చివేతలు మాత్రమే కాదని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్ అన్నారు. హైడ్రా పరిధి ఔటర్‌ రింగ్ రోడ్డు వరకే అని ఆయన చెప్పారు. నగరంలోనే కాదు.. రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లోనూ కూల్చివేతలను హైడ్రాకు ఆపాదిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. హైడ్రా పేదల నివాసాల జోలికి వెళ్లదని ఈ మేరకు కమిషనర్ రంగనాథ్ చెప్పారు. అలాగే ఇళ్లలో ప్రజలు నివాసం ఉంటే వాటిని కూల్చదని చెప్పారు.

కూల్చివేతలన్నీ హైడ్రావి కాదని కమిషనర్ రంగనాథ్ కామెంట చేశారు. ప్రజలు, సామాజిక మాధ్యమాలు ఈ విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వనరుల పరిరక్షణ, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడటం, వర్షాలు, వరదల సమయంలో రహదారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు తీసుకోవడం తమ బాధ్యత అని ఆయన చెప్పారు. ఇక మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో కూడా హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్పష్టం చేశారు. అక్కడి నివాసితులను హైడ్రా తరలించడం లేదని క్లారిటీ ఇచ్చారు. మూసీ నది వద్ద ఎలాంటి కూల్చివేతలను హైడ్రా చేపట్టడం లేదని కమిషనర్‌ రంగనాథ్ చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్‌ చేయడం లేదని వెల్లడించారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు అని.. దాన్ని మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చేపడుతోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు.

Next Story