హైడ్రా కమిషనర్‌కు మరో కీలక బాధ్యతలు..!
హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా హైడ్రా దుకుడుగా వ్యవహరిస్తోంది.
By Srikanth Gundamalla Published on 3 Sept 2024 7:33 AM ISTహైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా హైడ్రా దుకుడుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించడం, చెరువులను రక్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ సంస్థ అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నారు. ఈ సంస్థకు ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కమిషనర్‌గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కీలక బిల్డింగ్‌లను కూడా కూల్చేశారు. దాంతో.. హైడ్రా రాష్ట్రంలోనే హాట్‌టాపిక్ అయ్యింది. తాజాగా ఏవీ రంగనాథ్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా రంగనాథ్‌ను నియమిస్తారని తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకు ఈ బాధ్యతలను హెచ్ఎండీఏ కమిషనర్ నిర్వహిస్తున్నారు. హెచ్ఎండీఏలోని ఏడు జిల్లాల పరిధిలో చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కిందకు తేవడం ద్వారా ఆక్రమణలకు గురి కాకుండా చూడొచ్చని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా హైడ్రాతో పాటు చెరువుల పరిరక్షణ కమిటీ బాధ్యతలను కూడా రంగనాథ్‌కే అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వర్షాలు పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైడ్రా బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. నోటీసులు మాత్రం అందిస్తున్నారు. త్వరగా ఆయా భవనాలను ఖాళీ చేయాలని సూచిస్తున్నారు.