నా భర్తది ఆత్మహత్య కాదు..అధికారులు చేసిన హత్య: రవీందర్ భార్య

తన భర్త మరణానికి కారణం అధికారుల వేధింపులే అని రవీందర్‌ భార్య సంధ్య సంచలన ఆరోపణలు చేస్తోంది.

By Srikanth Gundamalla  Published on  8 Sep 2023 6:41 AM GMT
Home guard, Ravinder, death, wife,  allegations,

 నా భర్తది ఆత్మహత్య కాదు..అధికారులు చేసిన హత్య: రవీందర్ భార్య

హోంగార్డు రవీందర్‌ ఆత్మహత్యాయత్నం కేసు విషాదాంతం అయ్యింది. డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవీందర్‌ శుక్రవారం మృతిచెందారు. మూడ్రోజుల పాటు చికిత్స పొందితన తర్వాత తీవ్రంగా కాలిన గాయాలతో బాధపడుతున్న రవీందర్‌ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే.. హోంగార్డు రవీందర్‌ మృతితో జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన భర్త మరణానికి కారణం అధికారుల వేధింపులే అని రవీందర్‌ భార్య సంధ్య సంచలన ఆరోపణలు చేస్తోంది. ఉస్మానియా ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగింది.

తన భర్త రవీందర్‌ను అధికారులే తగులబెట్టారని సంధ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ చందు, ఏఎస్‌ఐ నర్సింగరావు కలిసి తన భర్తపై పెట్రోల్ పోశారని అన్నారు. కానీ..ఆ ఇద్దరినీ ఇప్పటి వరకు అరెస్ట్‌ చేయలేదన్నారు. హోంగార్డు ఆఫీస్‌ సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో లేదనీ.. అది దొరికితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని రవీందర్ భార్య పేర్కొన్నారు. తన భర్తపై అధికారుల నుంచి వేధింపులు వచ్చాయని.. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సంధ్య వాపోయింది. తన భర్త ఫోన్‌ తీసుకుని డేటా మొత్తం డెలీట్ చేశారని ఆరోపించింది. హమీద్‌ అనే అధికారి నా దగ్గరకు వచ్చి పెట్రోల్‌ బంక్‌లో ప్రమాదం జరిగిందని చెప్పాలన్నారు. అలా అయితేనే బెనిఫిట్స్‌ వస్తాయని చెప్పి.. నన్ను పక్కదారి పట్టించే యత్నం చేశారు అని సంధ్య ఆరోపించారు. తన భర్తను చంపిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని కన్నీళ్లతో డిమాండ్‌ చేస్తున్నారామె.

హోంగార్డులకు అధికారుల వార్నింగ్

హోంగార్డు రవీందర్ చనిపోవడంతో ఆయన కుటుంబానికి మద్దతుగా హోంగార్డులు ఎవరూ వెళ్లకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ ఘటనపై హెంగార్డు జేఏసీ సభ్యులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డులెవ్వరూ డ్యూటీకి వెళ్లొద్దని పిలుపునిచ్చారు. దాంతో.. అప్రమత్తమైన అధికారులు చర్యలు చేపట్టారు. రవీందర్ కుటుంబానికి ఎవరూ మద్దతుగా వెళ్లకుండా ఆదేశాలు జారీ చేస్తున్నారు. హోంగార్డులందరూ డ్యూటీలో ఉండేలా చూసుకోవాలని సీఐలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం డ్యూటీ ఉన్న హోంగార్డులం దరూ తప్పనిసరిగా డ్యూటీలో చేరాలని ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు. అలాగే డ్యూటీలో లేని హోంగార్డులందరూ తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో ఉండాలినీ.. పోలీస్ స్టేషన్ వదిలి ఎక్కడికి వెళ్ళకుండా చూడాలని స్పష్టం చేశారు. హోంగార్డులందరూ అందు బాటులో ఉండేలా ఇన్స్పె క్టర్లు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జరీ చేశారు. ఎవరైనా విధుల్లోకి రాకుండా ఉంటే వారి ఉద్యోగం ఎఫెక్ట్ పడొచ్చని అన్నారు.

Next Story