హయత్‌నగర్‌ బాలిక కిడ్నాప్‌ కేసు విచారణలో బయటపడ్డ ట్విస్ట్‌

హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవల బాలిక కిడ్నాప్‌ కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది.

By Srikanth Gundamalla  Published on  7 July 2023 12:13 PM IST
Hayathnagar, Girl, Kidnap Case, Twist, Aravind,

హయత్‌నగర్‌ బాలిక కిడ్నాప్‌ కేసు విచారణలో బయటపడ్డ ట్విస్ట్‌ 

హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవల బాలిక కిడ్నాప్‌ కేసు కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు. తాజాగా షాకింగ్‌ ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది.

పెద్ద అంబర్‌పేట్‌ పరిధిలో నివసించే బాలిక గత మంగళవారం రాత్రి పది గంటలకు ఇంట్లో గొడవపడి బయటకు వచ్చింది. రాత్రి వేళ రోడ్డుమీదకు నడుస్తూ వచ్చింది. అక్కడే బాలికకు తన తండ్రి దగ్గర పని చేసే యువకుడు అరవింద్‌ కనిపించాడు. దాంతో హయత్‌నగర్‌ వైపు తీసుకెళ్లాలని యువకుడిని కోరింది. అరవింద్‌ కూడా ఆమెను బైక్‌ ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అదే అదునుగా భావించాడు యువకుడు. బైక్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. బాలికపై అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. తన తండ్రి దగ్గర పని చేసే వ్యక్తే అలా ప్రవర్తిస్తాడని బాలిక ఊహించలేదు. దాంతో.. అరవింద్ నుంచి విడిపించుకుని రోడ్డుపైకి పరిగెత్తుకుంటూ వచ్చింది.

బాలిక రోడ్డుపైకి పరిగెడుతూ రావడాన్ని అక్కడే ఉన్న ఓ హిజ్రా గమనించింది. ఏంటి ఏం జరిగిందని ఆరా తీసింది. హిజ్రాను చూసి అరవింద్‌ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే.. ఇక్కడే బాలిక తన నాటకాన్ని మొదలుపెట్టింది. అరవింద్‌ పేరు చెప్పకుండా ఇద్దరు తనపై బలత్కారం చేయబోయారని చెప్పింది. దాంతో.. ఆ హిజ్రా పోలీసులకు సమాచారం ఇచ్చింది. తనను ఇద్దరు యువకులు బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లారని పోలీసులు, తల్లిదండ్రులకు కూడా చెప్పింది బాలిక. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు రెండో యువకుడు కనిపించలేదు. బైక్‌పై అరవింద్‌, బాలిక ఇద్దరే ఉన్నట్లు గుర్తించారు.

మరోసారి బాలికను విచారించగా అసలు విషయం బయటపడింది. అరవింద్‌ పేరు చెప్పకుండా .. సదురు బాలిక పోలీసులు, తల్లిదండ్రులను తప్పుదారి పట్టించింది. సీసీ కెమెరా ద్వారా అసలు నిజాన్ని బయటకు తీసుకురాగలిగారు పోలీసులు. చివరకు అరవింద్‌పై కిడ్నాప్, అత్యాచారయత్నం, పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అరవింద్‌ను నేడు రిమాండ్‌కు తరలించనున్నట్లు హయత్‌నగర్‌ పోలీసులు తెలిపారు.

Next Story