హైదరాబాదీలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నీటి కష్టాలకు చెక్
హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 7 Aug 2024 9:00 AM ISTహైదరాబాదీలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నీటి కష్టాలకు చెక్
హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే మంచి నీటి కష్టాలు తీరబోతున్నాయి. గోదావరి ఫేజ్-2 తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నగర ప్రజలు ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్నారు. దీని కోసం సుమారు రూ.5560 కోట్ల అంచనా వ్యయంతో మల్లన్నసాగర్ రిజర్వయార్ నుంచి హైదరాబాద్ నగరానికి మరో 15 టీఎంసీల నీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు పరపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ఉత్తర్వులను జారీ చేశారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం వ్యయంలో 40 శాతం హడ్కో లోన్ కింద ప్రభుత్వమే సమకూర్చనుంది. మరో 60 వాతం మొత్తాన్ని పనులు చేపట్టే ఏజెన్సీ భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించింది. తర్వాత ఈ నిధులను హైదరాబాద్ జలమండలి వడ్డీతో కలిపి చెల్లిస్తుంది.
హైదరాబాద్ నగర తాగునీటి అవసరానికి రోజుకు 750 మిలియన్ గ్యాలన్లు (ఎంజీడీ) అవసరం. ప్రస్తుతం నగరం చుట్టుపక్కల ఉన్న వివిధ జలాశయాల నుంచి సుమారు 600 ఎంజీడీ మాత్రమే మంచినీరు సరఫరా చేస్తున్నారు. 2050 నాటికి మంచినీటి సరఫరా డిమాండ్ 1014 ఎంజీడీకి పెరగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక గోదావరి నుంచి తరలించిన నీటిని శుద్ధి చేసేందుకు రాజేంద్రనగర్, శామీర్‌పేట, గండిపేట వద్ద భారీ శుద్ధి కేంద్రాలు నిర్మించనున్నారు. పంప్‌హౌస్‌లు, కరెంట్ ఉపకేంద్రాలు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉండనున్నాయి. ఇప్పుడు గోదావరి రెండో దశ ప్రాజెక్టు కోసం రూ.5,560 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అనుకున్న సమయానికి ఈ పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.