వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు
హైదరాబాద్‌లో వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 8 July 2023 1:10 AM GMTవీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు
హైదరాబాద్‌లో వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. చిన్నపిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలు దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కొన్నిసార్లు అయితే చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. వీధికుక్కల భయంతో చిన్నపిల్లలు బయటకు ఆడుకోవడానికి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. పిల్లలపైనే కాదు.. వీధి కుక్కల గుంపు కొన్నిసార్లు పెద్దలపైనా దాడి చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దు చిన్నారులపై వీధికుక్కలు దాడి చేశాయి.
హైదరాబాద్ నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోనిభక్త సమాజం కాలనీలో ఇద్దరు చిన్నారులు ఇంటి వద్ద బయట ఆడుకుంటున్నారు. చుట్టుపక్కల పెద్దవారు ఎవరూ లేరు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వారి వారి పనుల్లో ఉన్నారు. అప్పుడే అటుగా వచ్చిన కొన్ని వీధి కుక్కలు చిన్నారులపై దాడి చేశాయి. తీవ్రంగా నోటితో కరిచాయి. దాంతో.. చిన్నారులు భయపడిపోయి గట్టిగా అరిచారు. ఏడ్చాడు. పిల్లల అరుపులు విన్న స్థానికులు వెంటనే బయటకు వచ్చి కుక్కలను తరిమేశారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మరో చిన్నారికి స్వల్ప గాయాలు అయినట్లు తల్లిదండ్రులు చెప్పారు. వారి తల్లిదండ్రులు చిన్నారులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇకనైనా అధికారులు మేల్కొని వీధికుక్కల బారి నుంచి పిల్లలను కాపాడాలని.. తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులను కోరుతున్నారు.