గణేశ్‌ వేడుకల కోసం సంసిద్ధంగా ఉన్నాం: సీపీ స్టీఫెన్ రవీంద్ర

గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ, భద్రతపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమావేశం నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on  11 Sep 2023 2:49 PM GMT
Ganesh chaturthi, Cyberabad, CP Stephen Ravindra,

గణేశ్‌ వేడుకల కోసం సంసిద్ధంగా ఉన్నాం: సీపీ స్టీఫెన్ రవీంద్ర

రానున్న గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ, భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పోలీస్‌ అధికారులతో పాటు జీహెచ్‌ఎంసీ, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌, ఇరిగేషన్, రెవెన్యూ, మెడికల్ అండ్ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ సహా పలువురు అధికారులు హాజరు అయ్యారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ఈ నెల 18వ తేదీన ప్రారంభమై, సెప్టెంబర్ 28 వరకూ కొనసాగే గణేష్ వేడుకలను నిర్విఘ్నంగా, గౌరవప్రదంగా జరుపుకోవాలన్నారు. ఈ ఏడాది 12,000 వరకు వినాయకుల ప్రతిష్ట ఉండొచ్చని అంచనా వేశామన్నారు. గణేశ్ నిమజ్జనం సజావుగా సాగేందుకు పోలీసులు 24 X 7 పని చేస్తున్నారన్నారు. భద్రతాపరంగా పోలీసులు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ, భద్రతకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని స్టీఫెన్ రవీంద్ర సూచించారు. గణేష్ నిమజ్జనం మొదలుకొని అంతా ముందుగా ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని ఆయన కోరారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లోని పౌరవిభాగాలతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. మండపాలు ఏర్పాటు చేసుకునే వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.

నిమజ్జనం జరిగే చెరువుల వద్ద ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసి సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వినాయక నిమజ్జన విధుల్లో ఉండే ఉద్యోగులు, అధికారులు, వలంటీర్లకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నామని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దన్నారు.భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు(BGUS) ప్రతినిధులు లేవనెత్తిన పలు సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని సైబరాబాద్ సీపీ చెప్పారు. నిమజ్జనం దృష్ట్యా ట్రాఫిక్‌ మళ్లింపుపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, విజిబుల్ పోలిసింగ్ తో పాటు సీసీటీవీలపై ఫోకస్ చేశామన్నారు.

Next Story