Hyderabad: దసరా పండగకి ఊరెళ్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!
వరుస సెలవులు ఉండటంతో పట్నంలో ఉండే ప్రజలంతా స్వగ్రామాలకు పయనం అవుతుంటారు.
By Srikanth Gundamalla Published on 30 Sep 2024 1:15 PM GMTదసరా పండగ వచ్చేస్తోంది. వరుస సెలవులు ఉండటంతో పట్నంలో ఉండే ప్రజలంతా స్వగ్రామాలకు పయనం అవుతుంటారు. ఈ క్రమంలోనే పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. స్వగ్రామాలకు వెళ్లిన తర్వాత ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడుతుంటారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పలు సూచనలు చేస్తున్నారు. పండగ సెలవులపై ఇళ్లకు వెళ్లే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా దొంగతనాల నివారణకు సహకరించినట్లు అవుతుందని చెబుతున్నారు.
సైబరాబాద్ పోలీసులు చేసిన ముఖ్య సూచనలు:
* దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్లాల్సి వస్త విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్ల లో భద్రపర్చుకోండి
* సెలవులలో బయటకు వెళుతున్నప్పుడు సెక్యూరిటి అలారం, మోషన్ సెన్సర్ ను ఏర్పాటు చేసుకోవడం మంచిది
* తాళము వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే మీ స్థానిక పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వండి
* మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వండి
* మీ వాహనాలను మీ ఇంటి ఆవరణ లోనే పార్కు చేసుకొండి. లాక్ కచ్చితంగా చేసుకోండి
* నమ్మకమైన వాచ్ మెన్ లను మాత్రమే సెక్యూరిటి గార్డులుగా నియమించుకోండి
* మీ ఇంట్లో అమర్చిన CC Camera లను online లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి
* ఇంటి ముందు ఎక్కువగా పేపర్స్, పాలప్యాకెట్లు లేకుండా చూడాలి.. వాటిని చూసి కూడా దొంగతనాలకు వస్తుంటారు
* మెయిన్ డోర్ కి తాళం కప్ప వేసినప్పటికి అవి కనిపించకుండా కర్టెన్స్ తో కవర్ చేయడం మంచిది
* మీ ఇంటి దగ్గర మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్ళకు ఇంటిని చూసుకోమని చెప్పండి
* కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి.
* మీకు ఎవరిమీదైనా అనుమానం వస్తే 100 టోల్ ఫ్రీ నెంబర్ కు గాని, సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ 9490617100 కు లేదా మా వాట్సాప్ నెంబర్ 9490617444 కు dial చేయండి