డిసెంబర్‌ 7వ తేదీ నుంచి మళ్లీ హైదరాబాద్‌ నగర వాసులకు వరద సాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. శనివారం ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈ ఆరేళ్ల కాలంలో హైదరాబాద్‌ ప్రగతి నివేదిక, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికలను కేసీఆర్‌ ప్రజల ముందుంచారు. ఈ రోజు నగరంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కేసీఆర్‌ వ్యాఖ్యలపై అన్ని పార్టీల నుంచి కూడా ఆసక్తి నెలకొంది. 20వేల లీటర్ల వరకు న్లా బిల్లులు రద్దు చేశాం. ఢిల్లీ తర్వాత దేశంలో తెలంగాణలో మాత్రమే నల్లా బిల్లులు రద్దు, దీనిని అపార్టుమెంట్లకు వర్తింపజేస్తామని అన్నారు.

హైదరాబాద్‌ చాలా చైతన్యవంతమై నగరమని, ఓట్లు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని అన్నారు. భవిష్యత్తు కోసం నాయకుడి ప్రణాళికలపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు. హైదరాబాద్‌ వరదలు చూసి చలించిపోయా.. లక్షల మంది పేదల బతుకులు ఆగమవడం చూసి ఎంతో బాధపడ్డాను. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదని, దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు సాయం అందజేశామని అన్నారు. నగరంలో మళ్లీ వరద సాయం అందజేస్తామని, మరో రూ.300 కోట్లు ఇచ్చేందుకు సర్కార్‌ వెనుకాడదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి సాయం అందజేస్తామని, ప్రధానిని రూ.1300 కోట్లు సాయం అడిగితే 13 పైలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

2001లో ఉద్యమాన్ని ప్రారంభిస్తే సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. రాష్ట్రం అంధకారమవుతుందని కొంత మంది, నీళ్లు రావని మరి కొంత మంది శాపాలు పెట్టారని కేసీఆర్‌ ఆక్షేపించారు. అన్ని అవమానాలు, అపోహాల మధ్య టీఆర్‌ఎస్‌ పార్టీని నమ్మి దీవించి ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారన్నారు.

ప్రజల సహకారం ఉంటే రాబోయే కొన్ని నెలలు, సంవత్సరాల్లో హైదరాబాద్‌లో 24 గంటలూ నీరిచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పేదలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా నీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఇది నగర ప్రజలకు శాశ్వతంగా కేసీఆర్‌ అందించే కనుక. నగరంలో దాదాపు 98శాతం పేదలకు ఇది వర్తిస్తుంది అని కేసీఆర్‌ అన్నారు. అలాగే నగర ప్రజల సంక్షేమం కోసం నగరంలో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రంలో ప్రతియేటా రూ.42 వేల కోట్లకుపైగా సంక్షేమానికి కేటాయిస్తున్నామన్నారు. మా అభివృద్ధిని గమనించే ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కేసీఆర్‌ కోరారు. ఈ సభకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు.

సుభాష్

.

Next Story