హైడ్రా పేరుతో బ్లాక్‌మెయిల్.. రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణలపై ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 4 Sept 2024 10:15 AM ISTహైదరాబాద్‌లో అక్రమ నిర్మాణలపై ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ.. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ కూల్చేవతలు చేస్తూ హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగాహైడ్రా పేరును వినియోగించుకుని ఓ ప్రబుద్ధుడు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. హైడ్రా కమిషనర్ తనకు బాగా తెలుసని.. తనకు డబ్బులు ఇస్తే బిల్డింగ్ జోలికి రాకుండా చూసుకుంటానంటూ నమ్మబలికించాడు. చివరకు బిల్డర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
నగరంలో హైడ్రా అక్రమ నిర్మాణాలు నిర్మించిన బిల్డర్లపై కొరడా ఝళిపిస్తుండడంతో బిల్డర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. దీన్నే ఆసరాగా చేసుకున్న ఓ నేరగాడు బిల్డర్లను బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసే దందాకు తెర లేపాడు. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో MCOR Projects LLP ను నిర్మిస్తున్న బిల్డర్ కు హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో వెంటనే బిల్డర్ పోలీసులను ఆశ్రయించాడు. హైడ్రా పేరిట డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బిల్డర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
హైడ్రా కమిషనర్ రంగ నాథ్ తో దగ్గరి పరిచయం ఉందని చెప్పి కలిసి దిగిన ఫోటోలు చూపించి మరి బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొన్నాడు. పిస్తా హౌస్ వద్ద కలుద్దామని చెప్పి అక్కడికి పిలిచి హైడ్రా రంగనాథ్ తో కలిసి దిగిన ఫోటోలు చూపించాడని బిల్డర్ తన ఫిర్యాదులో చెప్పాడు. రంగనాథ్ తనకు బాగా దగ్గరని అమీన్పూర్ లో ఎలాంటి విషయమైనా తననే అడుగుతారని బెదిరించాడు. అయితే.. మీ నిర్మాణం జోలికి రావద్దు అంటే తనకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే హైడ్రాలో ఫిర్యాదు చేస్తానని, ప్రతిరోజు వార్తాపత్రికల్లో మీ నిర్మాణం గురించి తప్పుగా రాయిస్తానని బెదిరింపులకు గురి చేశాడు. హైడ్రా పేరుతో బెదిరింపులకు దిగిన విప్లవ్‌పై పోలీసులకు సదురు బిల్డర్ ఫిర్యాదు చేయడంతో అతని ఆట కట్టించేందుకు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.