హైడ్రా నోటీసులపై స్పందించిన మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్‌కు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 8 Sep 2024 7:30 AM GMTసినీ నటుడు మురళీ మోహన్‌కు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. తాజాగా హైడ్రా అధికారుల నోటీసులపై మురళీమోహన్ స్పందించారు. 33 ఏళ్లుగా తాను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను అని గుర్తు చేశారు. అయితే.. తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చారు. బఫర్ జోన్‌లో 3 అడుగుల మేర రేకుల షెడ్ ఉన్నట్లు గుర్తించామని అధికారులు చెప్పారన్నారు. అందుకు హైడ్రా అధికారులు రావాల్సిన అవసరం ఏమీ లేదనీ.. ఆ షెడ్డును తామే కూల్చేస్తామని స్పష్టం చేశారు మురళీ మోహన్. కాగా.. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువులో ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL), బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణ సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కొద్ది రోజులుగా హైడ్రా అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నగరంలో అక్రమంగా నిర్మించిన ఎవరినీ వదలడం లేదు. వారు వీరు అని తేడా లేకుండా అందరికీ నోటీసులు ఇస్తూ..అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చేస్తున్నారు. దీంతో HMDA పరిధిలోని 7 జిల్లాల్లో చెరువుల పరిరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను సైతం హైడ్రాకు అప్పగించడంపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఒక వేళ ఇదే జరిగితే హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చెరువుల ఆక్రమణలకు చెక్ పడుతుందని పలువురు భావిస్తున్నారు.