స్విమ్మింగ్ పూల్స్ వద్ద సేఫ్టీ పాటిస్తున్నారా?
పుప్పాలగూడలో స్విమ్మింగ్ పూల్‌లో ప్రమాదవశాత్తు జారిపడి ఐదేళ్ల బాలుడు నీటిలో మునిగి మృతి చెందాడు.
By News Meter Telugu Published on 6 July 2023 5:51 PM ISTస్విమ్మింగ్ పూల్స్ వద్ద సేఫ్టీ పాటిస్తున్నారా?
మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని పుప్పాలగూడలోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ప్రమాదవశాత్తు జారిపడి ఐదేళ్ల బాలుడు నీటిలో మునిగి మృతి చెందాడు. అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్థులోని స్విమ్మింగ్ పూల్ దగ్గర బాలుడు ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా నీటిలో పడ్డాడు. పిల్లలు వెంటనే బాలుడి తండ్రికి సమాచారం అందించారు, వెంటనే బాలుడిని బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు.
పుప్పాలగూడలోని అపార్ట్ మెంట్ మూడో ప్లోర్ లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుటుంబం ఉంటుంది. వారికి దినేష్ అనే ఐదు సంవత్సరాల బాలుడు ఉన్నాడు. ఆ అపార్ట్ మెంట్‌లో మూడో ఫ్లోర్ లోనే స్విమ్మింగ్ ఫూల్ ఉంది. దినేష్ ఆడుకుంటూ ఉండగా.. తల్లిదండ్రులు వారిపనిలో నిమగ్నమయ్యారు. దినేష్ ఆడుకుంటూ పక్కనే ఉన్న స్విమ్మింగ్ ఫూల్ లో పడిపోయాడు. అక్కడే ఉన్న మరో బాలుడు అది గమనించి తల్లిదండ్రులకు చెప్పడంతో దినేష్ ను నీళ్లలోంచి బయటకు తీసుకుని వచ్చారు. దినేష్ ఏమీ మాట్లాడకపోవడంతో హుటాహుటిన వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్లారు. అయితే దినేష్ అప్పటికే ప్రాణాలు వదిలాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భద్రతా చర్యలు లేకపోవడం
అపార్ట్‌మెంట్లలో ఉన్న స్విమ్మింగ్ పూల్స్ వద్ద భద్రతా చర్యల ప్రాముఖ్యతను గుర్తు చేసేదే ఈ మరణం. అటువంటి ప్రమాదాలను నివారించడానికి అనేక భద్రతా చర్యలు తీసుకోవాలి.
పర్యవేక్షణ: స్విమ్మింగ్ పూల్ లో ఎవరు ఉన్నారు, దగ్గారగా ఎవరు ఉన్నారు.. వంటి వాటిని చూసుకుంటూ ఉండాలి. అత్యవసర సమయంలో సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. సురక్షితమైన పూల్ వాతావరణం కోసం శిక్షణ పొందిన లైఫ్‌గార్డ్‌లు అవసరం. గచ్చిబౌలి గేటెడ్ కమ్యూనిటీ నివాసితులు ప్రకారం, పూల్ దగ్గర పిల్లలు ఆడకుండా సెక్యూరిటీ సిబ్బంది చూసుకుంటుందని తెలిపారు.
యాక్సెస్ కంట్రోల్: కొంపల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న శ్రావణి న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ, “గేటెడ్ కమ్యూనిటీలు స్విమ్మింగ్ పూల్‌ను ఉపయోగించుకోవడానికి యాక్సెస్ కార్డ్‌లను అందిస్తాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను తల్లిదండ్రులు లేకుండా పూల్‌లోకి అనుమతించరు. పిల్లలు పూల్‌లోకి ప్రవేశించే ముందు తప్పనిసరిగా సేఫ్టీ ట్యూబ్ రింగ్స్ ధరించాలి.
చుట్టూ సెక్యూరిటీ: పూల్ చుట్టూ కంచెలు, గేట్లు లేదా గోడలు అడ్డంకులుగా పెడుతూ ఉంటారు. పిల్లలు, ఇతరులను రానివ్వకుండా చేస్తాయి.
భద్రతా సంకేతాలు: పూల్ నియమాలు, డెప్త్ మార్కర్‌లు, అత్యవసర సంప్రదింపు సమాచారంతో కూడిన స్పష్టమైన సంకేతాలు ఉంచాలి. అలాంటప్పుడే నివాసితులు భద్రతా ప్రోటోకాల్‌లను అర్థం చేసుకోవడానికి, అనుసరించడానికి సహాయపడతాయి.
ఎమర్జెన్సీ ఎక్విప్‌మెంట్: స్విమ్మింగ్ పూల్స్ ఉన్న అపార్ట్‌మెంట్‌ల వద్ద అత్యవసర సమయాల్లో స్పందించడానికి వీలుగా లైఫ్ జాకెట్‌లు, ఫస్ట్ ఎయిడ్ చికిత్సకు కావాల్సిన సామగ్రిని అందుబాటులో ఉంచాలి.
సేఫ్టీ ఎడ్యుకేషన్: అపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ పూల్ సేఫ్టీ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేస్తూ ఉండాలి. స్విమ్మింగ్ పాఠాలను నివాసితులకు, పిల్లలకు తప్పకుండా నేర్పించాలి. భద్రతా మార్గదర్శకాలు, ఈత నైపుణ్యాలు, వాటర్ రెస్క్యూ టెక్నిక్‌ల గురించి అవగాహన కల్పించాలీ. భద్రతా అవగాహనను పెంపొందించాలి.
తనిఖీలు, నిర్వహణ: భద్రతా ప్రమాదాలను తగ్గించడానికి కావలసిన చర్యలు కూడా ముఖ్యం. ప్రమాదాలను వెంటనే గుర్తించి, పరిష్కరించడానికి అవసరమైన పరికరాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.