హైదరాబాద్ డాక్టర్‌ను రక్షించిన అనంతపురం పోలీసులు

By సుభాష్  Published on  28 Oct 2020 10:50 AM GMT
హైదరాబాద్ డాక్టర్‌ను రక్షించిన అనంతపురం పోలీసులు

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగీర్‌లో నిన్న సాయంత్రం డెంటిస్ట్ డాక్టర్ హుస్సేన్ ను అయన కారులోనే దుండగులు కిడ్నాప్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. దుండగులు కిడ్నాపర్లను అనంతపురం జిల్లా మీదుగా బెంగళూరు తీసుకెళ్తున్నారని సమాచారం అందటంతో అనంతపురం జిల్లాలోని అన్ని చెక్ పోస్ట్ లను అక్కడి ఎస్పీ సత్యయేసుబాబు అలర్ట్ చేశారు. అనంతపురం జిల్లాలో అక్కడి పోలీసులు కిడ్నపర్ల చెర నుంచి డెంటిస్ట్ డాక్టర్ హుస్సేన్ ను రక్షించారు.

డాక్ట‌ర్‌ కిడ్నాప్ వ్యవహారంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హుస్సేన్ అకౌంట్ లో పెద్ద మొత్తంలో నగదు ఉందని తెలుసుకున్న అతని బంధువు ముస్తఫా ఈ కిడ్నాప్ చేయించినట్టు తెలుస్తోంది. డాక్టర్ ను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని ప్లాన్ చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ముస్తఫా.. వాట్సాప్ కాల్ చేసి హుస్సేన్ కుటుంబ సభ్యులను కిడ్నాపర్ల చేత డబ్బులు డిమాండ్ చేయించాడు. ఆ డబ్బులు కూడా బిట్ కాయిన్ రూపంలో కావాలంటూ డిమాండ్ చేశాడు. ఫోన్ నెంబర్ ఆధారంగా వెహికిల్ ని ట్రేస్ చేసిన సైబరాబాద్ పోలీసులు.. అనంతపురం పోలీసులకు సమాచారమిచ్చారు. డాక్టర్ హుస్సేన్ అపార్ట్మెంట్ లో అద్దెకు ఉండే ఖలీద్ ను అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారించగా కిడ్నాప్ వ్యవహారం బయటపడింది. పోలీసుల అదుపులో ప్రస్తుతం ఆరుగురు నిందితులు ఉన్నారు.

అస‌లేం జ‌రిగిందంటే..?

నగర శివారులోని రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగీర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. దంత వైద్యుడైన బెహజత్ హుస్సేన్ (57) ఎక్సైజ్ అకాడమీ సమీపంలోని ప్రెస్టీజ్ విల్లాస్ లో నివసిస్తున్నారు. అక్కడికి సమీపంలోనే మరో భవనంలో క్లినిక్ నిర్వహిస్తున్న ఆయన రోజు లానే నిన్న మధ్యాహ్నం భోజనం కోసం క్లినిక్ నుంచి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

అదే సమయంలో బురఖాలు ధరించిన కొందరు వ్యక్తులు క్లినిక్ లోపలికి ప్రవేశించారు. వైద్యుడి వ్యక్తిగత సహాయకుడు సయ్యద్ సల్మాన్‌ను కొట్టి నోటికి ప్లాస్టర్ వేశారు. కాళ్లు, చేతులు కట్టి బాత్రూంలో పడేశారు. అనంతరం వైద్యుడిపైనా చేయిచేసుకున్న దుండగులు బయట కారు వద్దకు ఆయనను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి బలవంతంగా ఆయన కారులోనే ఎక్కించుకుని శంకర్‌పల్లి రోడ్డువైపుగా వెళ్లారు.

కాసేపటికి దుండగులు కట్టిన తాళ్లను తెంపుకున్న సయ్యద్.. వైద్యుడి ఇంట్లోనే పనిచేసే తన తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఆయన ద్వారా విషయం తెలుసుకున్న హుస్సేన్ భార్య 100 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి సీసీటీవీ పుటేజీలను పరిశీలించారు.

Next Story
Share it