వరంగల్‌: సంచలన తీర్పు.. 9 మంది హత్య కేసులో సంజయ్‌కి ఉరి శిక్ష

By సుభాష్  Published on  28 Oct 2020 9:58 AM GMT
వరంగల్‌: సంచలన తీర్పు.. 9 మంది హత్య కేసులో సంజయ్‌కి ఉరి శిక్ష

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట లో జరిగిన 9 మంది హత్య కేసులో వరంగల్‌ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ హత్యలకు కారకుడైన సంజయ్‌కి ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఒక హత్యకు కప్పిపుచ్చుకునేందుకు మరో 9 మందిని హత్యలకు కారకుడైన సంజయ్‌కు ఉరి శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కాగా, మే 21న గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులో పాడుబడిన బావిలో తొమ్మిది మందిని హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతులందరికి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు సంజయ్‌ వారు మత్తులోకి జారుకోవడంతో హత్య చేసి బావిలో పడేశాడు. ముందుగా మహిళ హత్యను కప్పిపుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్‌కుమార్‌ యాదవ్‌ మరో 9 మందిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే కేసు నమోదైనప్పటి నుంచి కేవలం ఐదు నెలల వారం రోజుల్లో నిందితుడికి శిక్ష పడే విధంగా గీసుకొండ సీఐ శివరామయ్య సాక్షాలు సేకరించి తన పనితనాన్ని ప్రదర్శించారు. 25 రోజుల్లోనే కోర్టు నేరారోపణకు సంబంధించిన పత్రాలు దాఖలు చేశారు. నిందితుడికి ఉరిశిక్ష పడటంపై వరంగల్‌ పోలీసు కమిషనర్‌ ప్రమోద్‌ హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఈ తీర్పు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కేసుపై ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. కేసులు ఛేదించారు. అయితే 9 మందిని హత్య చేసింది సంజయ్‌ అని తేలింది. మక్సూద్‌ కుటుంబంతో ఉంటున్ను బుస్రాతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సంజయ్.. తనకు అడ్డు రావద్దని మక్సూద్‌ కుటుంబంతో పాటు సన్నిహితంగా ఉన్న బీహార్‌కు చెందిన యువకులను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలోనే పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్‌ రిపోర్టుల ద్వారా పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. దీంతో అనుమానితులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా, బుస్రా ప్రియుడు సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ తన స్నేహితులతో కలిసి సామూహిక హత్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిద్రమాత్రలు ఇచ్చిన సృహ కోల్పోయిన తర్వాత 9 మందిని గోనె సంచిలో పెట్టి బావిలో పడేసినట్లు తేలింది. కాగా, మక్సూద్‌ కుటుంబం పశ్చిమబెంగాల్ నుంచి వరంగల్‌లోని కరీమాబాద్‌కు 20 ఏళ్ల క్రితం వలస వచ్చింది. గొర్రెకుంటలోని గోనెసంచీల ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. కాగా, లాక్‌డౌన్‌ కారణంగా కరీమాబాద్‌ నుంచి రావడం ఇబ్బందిగా ఉండటంతో మక్సూద్‌ కుటుంబం ఫ్యాక్టరీలోనే ఉంటోంది. ఇక అదే ఆవరణలో శ్యామ్‌, శ్రీరామ్‌ అనే బీహార్‌కు చెందిన యువకులు ఉంటున్నారు.

మక్సూద్‌ కుటుంబం కనిపించకుండా పోవడంతో ఫ్యాక్టరీ యజమాని సంతోష్ చుట్టుపక్కల గాలించగా, ఓ బావిలో శవాలు కనిపించాయి. ముందుగా నాలుగు శవాలు బయటపడగా, తర్వాత మరో ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. శ్యామ్‌, శ్రీరామ్‌ యువకులతో పాటు మక్సూద్‌ ఇద్దరు కుమారుల శవాలు బయటపడ్డాయి. ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మక్సూద్‌ కూతురు బుస్రా వరంగల్‌లోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, భర్తతో విడిపోయిన బుస్రా తన మూడేళ్ల కుమారుడితో వారి వద్దనే ఉంటోంది. వీరితో పాటు గన్నీ సంచుల గోదాం పక్కనే ఉన్న పై అంతస్తులో బీహార్‌కు చెందిన శ్రీరాం, శ్యామ్‌లు ఉన్నారు. ఇక నగరంలోని సంజయ్‌కుమార్‌ యాదవ్‌ అనే వ్యక్తితో బుస్రాం వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో మక్సూద్‌ ఇంట్లో తరచూ గొడవలు కూడా జరిగేవని పోలీసుల విచారణలో తేలింది. ఇక ఇంటిపైనే ఉంటున్న బీహార్‌కు చెందిన యువకులు శ్రీరాం, శ్యామ్‌లు వీరి గొడవలో జోక్యం చేసుకుని బుస్రాపై కన్నేసినట్లు పోలీసుల విచారణ తేలింది. విషయం తెలుసుకున్న సంజయ్‌ కుమార్‌ పథకం ప్రకారం ఈ 9 మందిని హతమార్చాడు.

కుమారుని పుట్టిన రోజే ...

కాగా, సంజయ్‌ కుమార్‌ యాదవ్‌.. మక్సూద్‌ ఆలం కుటుంబాన్ని హతమార్చేందుకు మే 16 నుంచి 20వ తేదీ వరకు రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణ వెల్లడైంది. ప్రతి రోజు సైకిల్‌పై వారు నివసించే ఇంటికి వస్తూ పరిశీలించాడు. ఆ కుటుంబంలో ఐదుగురికి తోడు పక్కనే మరో భవనంపైభాగంలో నివాసం ఉంటున్న బీహార్‌కు చెందిన శ్రీరాం, శ్యామ్‌ను గుర్తించాడు. చివరకు మే 20న మక్సూద్‌ ఆలం పెద్ద కుమారుడు షాబాజ్‌ ఆలం పుట్టిన రోజు అని తెలుసుకుని సాయంత్రం వెళ్లాడు. మెడికల్‌ షాపులో నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. మక్సూద్‌ ఆలం కుటుంబంతోమాటల్లో ఉండగానే వండిన పప్పులో నిద్రమాత్రలను కలిపాడు. అదే విధంగా శ్రీరాం, శ్యామ్‌ ఆహారంలో కూడా వాటిని కలిపాడు. రాత్రి 12 గంటల వరకు అందరూ మత్తులో ఉండగా ఒకరి వెంట ఒకరు గోనే సంచిలో పెట్టుకుని పెట్టుకుని తీసుకొచ్చాడు. గోదాం బావి మధ్యలో ఉన్న ప్రహరీగోడపై ఒక్కొక్కరిని ఉంచాడు.ఆపై తాను గోడ దూకి వారిని తీసుకెళ్లి బావిలో పడేశాడు. ఉదయం బయటపడిన ఈ ఘటనపై పోలీసులు తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీంతో ఈ 9 మంది మృతి కేసులో వరంగల్‌ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకుని సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు అప్పగించడంతో నిందితుడు సంజయ్‌కి ఉరి శిక్ష ఖరారైంది.

Next Story