కుండపోత వర్షం… నగరం అతలాకుతలం..!

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మంత్రి కేటీఆర్‌ సైతం ట్రాఫిక్‌లో ఇరుకున్నారు. భారీ వర్షంతో బంజారాహిల్స్‌లో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అటుగా వెళ్తున్న మంత్రి కేటీఆర్‌ వాహనం సైతం ట్రాఫిక్‌లో నిలిచిపోయింది.

లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులపై వరద నీరు పోటెత్తింది. పలు బస్తీల్లో ఇళ్లలోకి చేరిన వర్షపునీటిని తొలగించేందుకు స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రధాన రహదారులపై ఎక్కడికక్కడే ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి బయలుదేరిన ఉద్యోగులు, విద్యార్థులు ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుపోయారు.

కొండాపూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. కరెంటు స్తంబాన్ని పట్టుకున్న ఆడమ్‌మార్క్ అనే వ్యక్తి మృతి చెందాడు. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, ఎస్‌ఆర్‌నగర్, హిమాయత్‌నగర్, కొత్తపేట, చైతన్యపురి, అబిడ్స్, కోఠిలో వర్షం కారణంగా రోడ్లు జలమయం అయ్యాయి.

భారీ వర్షం కారణంగా ఎల్బీనగర్‌ నుంచి అమీర్‌పేట్‌, మియాపూర్‌ రూట్‌లో మెట్రో సర్వీసులకి అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటకు పైగా రైళ్లు నిలిచిపోయాయి. ట్రాక్‌పైకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.