హైదరాబాద్ లో కుప్పకూలిన పాత భవనం

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 3 Oct 2019 11:23 AM IST

హైదరాబాద్ లో కుప్పకూలిన పాత భవనం

హైదరాబాద్ : గోషామహల్ చక్నావాడి లో ఓ భవనం కుప్పకూలింది. వర్షాల కారణంగా గోడలన్ని తడిచిపోవడంతో భవనం కుప్పకూలింది. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. ఈ భవనం పక్కపక్కనే నూతనంగా రెండు భారీ అపార్టుమెంట్లు నిర్మించారు. ఈ అపార్టుమెంట్ యజమానులు పూర్తి స్థాయి నిర్మాణ అనుమతులు లేకుండా.. సెల్లార్ లు తీయడంతో పక్కనే ఉన్నా పాత భవనం కూలినట్లు ఇంటి యజమాని శ్రీధర్ అనుమానిస్తున్నారు. ఈ విషయం పై అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించాడు.

ఇది ఇలా ఉంటే..కూలిన భవనాన్ని పిల్లర్స్ లేకుండానే నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా..ఇంటి ఎదురుగా భారీ నాలా ఉంది. అందువలనే భవనం కుప్పకూలిందని స్థానికులు అన్నారు. వర్షకాలం కావడంతో గ్రౌండ్ ఫ్లోర్ గోడలు కూడా కుంగిపోయాయి. అయితే..బుధవారం నుంచే ఇంటి పెచ్చులు ఊడి పడుతుండటంతో భయభ్రాంతులైన కుటుంబ సభ్యులు ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. స్థానికులు, యజమాని ద్వారా సమాచారం అందుకున్న డి.ఆర్‌.ఎఫ్ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది.

భారీ వర్షాలతో ఇప్పటికే ముంబైలోని పాత భవనాలు కూలుతున్న సంగతి తెలిసిందే. అయినా..హైదరాబాద్ లో అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వలనే పాత భవనం కూలింది. ఇలాంటి భవనాలు హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. ఇప్పటికే అధికారులు ఈ విషయంపై దృష్టి పెడితే మంచిదనే అభిప్రాయం నగరవాసుల్లో వ్యక్తమవుతుంది.

Next Story