నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Sep 2019 4:09 PM GMT
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

హైదరాబాద్: అధికారుల నిర్లక్ష్యం..నాణ్యత లోపం..వెరసి ఓ నిండు ప్రాణం మెట్రో పాలైంది. వాన పడుతుందని తలదాచుకోవడానికి వస్తే ఏకంగా ప్రాణాలే పోయాయి. ఈ ఘటన అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో మెట్రో స్టేషన్‌కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. మెట్రో రైలును త్వరగా ట్రాక్‌ ఎక్కించాలనే ఆలోచనతో అధికారులు నాణ్యతను పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.

మెట్రో రైలు పనులు రికార్డు స్థాయిలో శరవేగంగా సాగాయి. పనులు వేగం సరే..నాణ్యత కూడా చాలా ముఖ్యం. పనుల వేగంలో పడి నాణ్యతను మెట్రో ప్రతినిధులు మరిచారా? . అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో జరిగిన ఘటనను చూస్తే ఈ ప్రశ్నలే తలెత్తుతున్నాయి. మెట్రో ప్రారంభమై పట్టుమని ఆరు నెలలు కూడా కాకముందే పెచ్చులూడటంపై ప్రయాణికులు సహా వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.

వర్షం పడుతుండటంతో అటుగా వెళ్తున్న కూకట్‌పల్లికి చెందిన మౌనిక అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ కిందకు వచ్చింది. అనుకోకుండా మెట్రో స్టేషన్ పెచ్చులు ఊడి మౌనిక తల మీద పడ్డాయి. ఉన్నట్టుండి మౌనిక పెద్దగా కేక వేయడంతో అటుగా పోతున్న జనం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. జనాలు దగ్గరకు వచ్చే సరికి మౌనిక కుప్పకూలి పోయింది. తల నుంచి రక్తం కారుతుంది. వెంటనే అప్రమత్తమైన ఎల్‌ అండ్ టీ సిబ్బంది.. ఆమెను ప్రత్యేక వాహనంలో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే మౌనిక చనిపోయింది.

విషయం తెలుసుకున్న ఎస్.ఆర్ నగర్ పోలీసులు కూడా అమీర్ పేట మెట్రో స్టేషన్ కి చేరుకున్నారు. అక్కడ స్పాట్ లో ఉన్నవారి నుంచి వివరాలు సేకరించారు. స్టేషన్ లో నిలబడి ఉన్న మౌనికపై 9 మీటర్ల పై నుంచి పెచ్చులూడి ఆమె తలపై పడ్డాయి. దీంతో తలకు బలమైన గాయమైంది. . ఎప్పుడైతే పెచ్చులూడి పడుతుండటం గమనించిన ప్రయాణికులు, జనం భయంతో పారిపోయారు. ఎక్కడ స్టేషన్ కూలి తమ నెత్తిన పడుతుందోనని అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని మరీ పరుగులు తీశారు.

విషయం తెలియగానే మౌనిక కుటుంబ సభ్యులు కూడా వెంటనే ఆసుపత్రికి వచ్చారు. ఎల్ అండ్ టి అధికారుల నిర్లక్ష్యమే వలనే తన భార్య ప్రాణాలు పోయాయని మౌనిక భర్త ఆరోపించారు. మౌనిక ఘటనతో మెట్రో స్టేషన్ల కింద నిలబడాలి అంటేనే జనాలు, ప్రయాణికులు, వాహనదారులు భయపడుతున్నారు. చిన్నపాటి వర్షానికే పెచ్చులూడితే..భారీ వర్షం పడితే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

స్పీడ్ గా నిర్మాణం చేపట్టాలన్న ఉద్దేశ్యంతో పనుల్లో నాణ్యత లోపించిందని ఆరోపిస్తున్నారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు . నాణ్యత లేని స్టేషన్ లో తిరిగి పనులు ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర వాసులు అంటున్నారు.

Next Story