జూన్‌ 1 తర్వాత హైదరాబాద్‌ మెట్రో..!

By సుభాష్  Published on  23 May 2020 1:23 PM GMT
జూన్‌ 1 తర్వాత హైదరాబాద్‌ మెట్రో..!

కరోనా మహమ్మారితో లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌ మెట్రో సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇక జూన్‌ 1 తర్వాత మళ్లీ పునః ప్రారంభం కానున్నాయి. ఇందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌లో ప్రజా రవాణాలో మెట్రో రైళ్లు చాలా కీలకంగా మారాయి. ఇప్పటికే హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు తిరిగేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో సిటీ బస్సులు, మెట్రోలకు అనుమతి ఇవ్వలేదు.

ఇక ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి ఉండటంతో ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో వారి కోసం శనివారం నుంచి సిటీ బస్సులను నడిపేందుకు అనుమతి ఇచ్చారు సీఎం కేసీఆర్‌. ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి బస్సు ఎక్కాల్సి ఉంటుంది. నగరంలోని 32 మార్గాల్లో ఈ బస్సులు నడపనున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలో మెట్రో రైళ్లను నడిపేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే మెట్రో రైలులో సీట్లకు ఒక సీటు గ్యాప్ ఉంచుతూ ప్రయాణికులు కూర్చునేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మెట్రోలో ప్రయాణించేవారు భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Next Story