మన హైదరాబాద్ “అనారోగ్య మణిహారంలో మరో మేలు రత్నం” వచ్చి చేరిందండోయ్. ఊబకాయం, అనారోగ్యాల విషయంలో చాలా నగరాలకన్నా మనమే ముందున్నామట. మన అమ్మాయిలు లావు విషయంలో మాలావు ఖ్యాతిని గడించేస్తున్నారట. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సంస్థ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహిస్తే, లావు విషయంలో మనం ఢిల్లీ, ముంబాయిలను మించిపోయామని తేలింది.

మారుతున్న జీవన శైలి, అదుపు లేని జంక్ ఫుడ్ వాడకం, అర్థరాత్రి వరకూ మేల్కొనడం, తెల్లవారే ఆలస్యంగా లేవడం, వ్యాయామాన్ని పూర్తిగా పక్కన బెట్టేయడం, వృత్తిపరమైన ఒత్తిడులు... ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు మన మహానగరం మహాకాయ నగరంగా మారిపోవడానికి బోలెడన్ని కారణాలున్నాయి. హైదరాబాద్ లో 48.07 శాతం మహిళలు, 31.01 శాతం పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారని తేలింది. మన తరువాతి స్థానం విశాఖపట్నానికి దక్కింది ఎక్కువగా యువకులే ఊబకాయంతో బాధపడుతుండటం విశేషం. అధిక బరువు వల్లే బీపీ, షుగర్ వంటి వ్యాధులు యువతలో పెచ్చరిల్లుతున్నాయి.

మొత్తం మీద చూస్తే దేశంలోని ప్రతి అయిదుగురు మగవారిలో ఒకరు, ప్రతి ఏడుగురు మహిళలలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. దేశంలో కోటిన్నర మంది పిల్లలు కూడా ఊబకాయంతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య హైదరాబాద్ లో ఇంకా ఎక్కువగా ఉందని సర్వేలో తేలింది.

సర్వే నివేదికలో కొద్దిపాటి జీవనశైలి మార్పులతో ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. రోజుకు నలభై నిమిషాల వ్యాయామం, తినే ఆహారం మోతాదును తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం, క్రొవ్వు పదార్థాలు, జంక్ పుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, వేపుళ్లు బాగా తగ్గించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. మద్యపానం, కూల్ డ్రింకుల సేవనం, పొగాకు వాడకం నుంచి దూరంగా ఉంటే మంచిదని కూడా వారు చెబుతున్నారు. తీపి పదార్థాలు, నూనె పదార్థాల వాడకాన్ని తగ్గించాలని వారు సలహా ఇస్తున్నారు.

రాణి యార్లగడ్డ

Next Story