గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) వెటర్నరీ  అధికారులు హైదరాబాద్ లోని కుక్కల సంఖ్యపై ఓ అవగాహన తీసుకొని వచ్చేలా సర్వే నిర్వహించాలని యోచిస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో కుక్కల సంఖ్య అధికంగా ఉంది..? వాటికి వ్యాక్సిన్లు వేయించారా లేదా..? కుక్కల జనన నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు..? అన్న వాటిపై ఓ అంచనాకు రానున్నారు. ఈ పనిని ఓ అవుట్ సోర్సింగ్ ఎన్జీవో కు అప్పగించనున్నారు. అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సూచనలు, సలహాలు పాటించి తాజా సర్వే నిర్వహించనున్నారు.

ఇంతకు ముందు నిర్వహించిన సర్వే ప్రకారం..హైదరాబాద్ నగరం లోని వివిధ ప్రాంతాల్లో 7.5 లక్షల కుక్కలు ఉన్నట్లు రికార్డుల్లోకి ఎక్కింది. మురికివాడల లోనూ.. ఏయే ప్రాంతాల్లో కుక్కల సంఖ్య అధికంగా ఉంటుందో ఆయా ప్రాంతాల్లో యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్, అనిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రాంలను ఇంతకు ముందు కూడా చేపట్టామని అధికారులు తెలిపారు.

వేసవి కాలంలో కుక్కల బెడద కాస్త ఎక్కువగా ఉండడానికి కారణమేంటని జిహెచ్ఎంసీ ఛీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్ ని అడుగగా.. వేసవి కాలంలో వీధి  కుక్కలకు ఆహారం, నీళ్లు తగినంత దొరక్కపోవడమే కాకుండా.. స్కిన్ ఇన్ఫెక్షన్లు సోకుతుండడంతో కుక్కలు కాస్త దూకుడుగా ప్రవర్తిస్తూ ఉంటాయని.. అలాంటి సమయంలోనే కుక్క కాట్లు అన్నవి ఎక్కువగా నమోదవుతూ ఉంటాయని చెప్పారు.

వేసవి కాలంలో చెత్తకుప్పల్లో పడవేసిన ఆహారపదార్థాలు చాలా తక్కువ సమయంలోనే చెడిపోతాయి. ఎండ వేడిమికి మిగిలిన ఆహారం కూడా పాడవడంతో వీధి కుక్కలకు తగినంత ఆహారం దొరకదు. అలాగే వేసవిలో వాటికి నీరు దొరకడం కూడా అంతతమాత్రమే.. దానికి తోడు వీధి కుక్కలకు వేసవికాలంలో సోకే చర్మ వ్యాధులు కూడా కుక్కలలో కోపోద్రేకాలు పెరగడానికి కారణమని అన్నారు. అన్ని కుక్క కాట్లు రేబీస్ కు దారితీయవని డాక్టర్ వకీల్ చెప్పుకొచ్చారు. ఫీవర్ హాస్పిటల్ లోనూ, మిగిలిన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ చికిత్సకు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని అన్నారు.

ఇటీవల బేగంపేట్ ప్రాంతంలో ఓ కుక్క పలువురిపై దాడి చేసి గాయపరిచింది. ఆ కుక్కకు రేబిస్ పాజిటివ్ ఉండడంతో కార్పొరేషన్ అధికారులు యాంటీ రేబిస్ వాక్సినేషన్లు అన్ని కుక్కలకు వేయాలని సంకల్పించారు. కుక్క దాడిలో గాయపడ్డ వారి సమాచారాన్ని కనుగొని..వారు సరైన ట్రీట్మెంట్ తీసుకున్నారా.. లేదా.. ఆరాతీస్తున్నారు. గత సంవత్సర కాలంలో జిహెచ్ఎంసి అధికారులు 46,473 వీధి కుక్కలకు బర్త్ కంట్రోల్ సర్జరీలు చేయించారు. 78, 822 కుక్కలకు వ్యాక్సిన్లు వేయించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.