“దిశా” కోసం రోడ్లెక్కారు. కొవ్వొత్తులు వెలిగించారు. పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. ధర్నాలు, ర్యాలీలు తీశారు. పార్లమెంటులో ఎంపీలు స్పందించారు. రేపిస్టులు మళ్లీ రేప్ చేయకుండా వృషణాలు తొలగించమన్నారు. రేప్ చేసిన వాడికి రేపు లేకుండా ఉరి తీయమన్నారు. నటులు, నాయకులు, మేథావులు గళం విప్పారు. కాలేజీ కుర్రాళ్లు శంఖారావం పూరించారు.

అంతా బాగుంది. అసలు కథేమిటంటే…. గత నాలుగైదు రోజులుగా పోర్న్ సైట్లలో ఎడతెగని వెతుకులాట జరుగుతోందిట. దిశా రేప్ విడియో దొరుకుతుందేమోనని తెగ సెర్చి చేస్తున్నారట. సెర్చిలో “దిశా రేప్” టాప్ లేపేస్తోందట. ప్రపంచ ప్రఖ్యాత పోర్న సైట్లన్నిట్లోనూ ఇదే సెర్చింగ్ నడుస్తోందట. ఇంతకీ వెతికే వాళ్లెవరు? ఇంకెవరు? మనమే!! అవును …. మనమే!!

ఒక వైపు కిరాతకమైన రేప్ పై గళం విప్పుతూనే, పోర్న్ సైట్లో అదే రేప్ క్లిప్ కోసం వెతుకుతున్నదీ మనమే. మానసిక రేప్ కోసం మన ప్యాంట్ విప్పుతున్నది మనమే!! ఒకవైపు ఆమె కోసం కళ్లలో కన్నీరు కారుస్తూ, మరో వైపు ఆ రేప్ దృశ్యం దొరుకుతుందేమోనని చొంగ కారుస్తున్నదీ మనమే!! రెండు నాల్కల ధోరణికి, అంతులేని హిపాక్రసీకి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ దొరుకుతుందా? పైకి కృష్ణుడిలా చీరలందించే మనలోనే చీర లాగేసే దుశ్శాసనులూ ఉన్నారన్నది భయంకరమైన సమస్య. “రేపిస్టులు భలే అదృష్టవంతులురా. భలే అందమైన అమ్మాయి దొరికింది వాళ్లకు” అని ట్వీట్లు చేసి అసూయపడిపోయిన వారికి, ఆ క్లిప్పు కోసం అంతలా పోర్న్ ప్రపంచమంతా భూతద్దం ఐకాన్ సాయంతో గాలింపు చేస్తున్న వాళ్లకు తేడా ఏముంది?

రేపిస్టులకు ఉరే సరి అనే వాళ్లందరికీ ఓ చిన్న సూచన!! చనిపోయిన దిశ రేప్ క్లిప్ ను చూడాలని ఉబలాటపడుతూ నెట్టింట్లో వెతికేస్తున్న వాళ్లందరికీ ఒక మాట. అసలు ఉరి తీయాల్సింది ఆ నలుగురు రేపిస్టులను కాదు. మన మనసుల్లో దాగున్న మానసిక రేపిస్టులని.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.