చెస్ రారాణి సెకండ్ ఇన్నింగ్స్ - గ్రాండ్ సక్సెస్..!

By Newsmeter.Network  Published on  30 Dec 2019 5:57 AM GMT
చెస్ రారాణి సెకండ్ ఇన్నింగ్స్ - గ్రాండ్ సక్సెస్..!

ముఖ్యాంశాలు

  • ప్రపంచ టైటిల్ సాధించిన హంపి కోనేరు
  • తల్లి కావడం వల్ల రెండేళ్లుగా ఆటకు దూరం
  • తల్లిదండ్రుల సహకారంతో మళ్లీ సాధన
  • హంపికి అత్తమామలు, భర్త సపోర్ట్
  • హంపిని ఎంతగానో ప్రోత్సహించే తండ్రి

కోనేరు హంపి మళ్లీ విజయ పతాకం ఎగరేసింది. వరల్డ్ ర్యాపిడ్ చెస్‌లో ఆమె సాధించిన విజయం తన ముద్దుల కూతురికి బహుమానంగా ఇచ్చింది. 2016 నుంచీ 2018 వరకూ రెండేళ్లపాటు తల్లి అయిన కారణంగా హంపి చెస్‌కి దూరంగా ఉండాల్సొచ్చింది. ఈ రెండేళ్లూ తన పాపాయిని చూసుకోవడానికే సరిపోయింది. మళ్లీ తిరిగి పోటీల్లో అడుపెట్టగానే సాధించిన విజయాన్ని తను తన చిన్నారి పాపాయి ఆహ్నాకి కానకగా ఇచ్చింది.

ముద్దుల పాపాయిని ఒళ్లో కూర్చోపెట్టుకుని సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడానికి హంపి చాలా శ్రమ పడాల్సొచ్చింది. సరిగ్గా ఆ సమయంలో తనకు తన తల్లిదండ్రులు, అత్తమామలు ఎంతో సాయం చేశారని, అందువల్లే తిరిగి తను మళ్లీ ఫామ్ లోకి రావడానికి వీల్లయ్యిందనీ చెబుతోందీ చెస్ సూపర్ స్టార్.

హంపి భర్త ఆఫీస్ కెళ్లేటప్పుడు పాపాయిని అత్తగారింట్లో, అమ్మగారింట్లో వదిలిపెట్టి వెళ్లేవాడు. తిరిగి సాయంత్రం ఇంటికెళ్లేటప్పుడు మళ్లీ తనతోపాటు తీసుకెళ్లేవాడు. హంపి ఈ సమయంలో పూర్తిగా గేమ్ మీదే తన దృష్టిని నిలిపి మళ్లీ అద్భుతమైన విజయాలు సాధించే స్థితికి సాధన చేసింది. ఒక రకంగా చెప్పాలంటే తనలో ఉన్న తల్లి ఇలా రోజంతా పాపాయికి దూరంగా ఉండడానికి అంగీకరించలేదు. కానీ తన ప్రేమను, ముద్దు మురిపాలను మనసులోనే దాచుకుని, భావావేశాన్ని అధిగమించి కెరీర్ పై పూర్తిగా దృష్టి నిలిపింది.

ఆ సమయంలో తన మొహంలో చాలా ఒత్తిడి కనిపించేదని హంపి తల్లి చెబుతున్నారు. “ఏం ఫర్వాలేదులే మేం చూసుకుంటాం కదా అన్న భరోసాని ఇచ్చినా ఆ తల్లి మనసు పాపాయికోసం అల్లాడిపోయేది. కానీ ఎంతో పరిణతి కలిగిన ప్రొఫెషనల్ ప్లేయర్ ఆమె. చాలా సులభంగానే తన మనో భావాలను నియంత్రించుకోగలిగింది. పూర్తి స్థాయిలో గేమ్ మీద కాన్ సన్ ట్రేట్ చేయగలిగింది” అంటున్నారు హంపి తల్లి లత.

ప్రపంచ టైటిల్ సాధించడంపై సంతోషం

హంపి మళ్లీ విజయపథంలో సాగిపోవాలన్న తమ కలలను నిజం చేస్తూ తను సాధించిన సక్సెస్ మొత్తం కుటుంబసభ్యులందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆమె చెబుతున్నారు. హంపి తండ్రికూడా తాను సాధించిన విజయంపై ఎంతో సంతోషంగా ఉన్నారు. చాలాకాలం తర్వాత మళ్లీ తన కూతురు వరల్డ్ టైటిల్ ని సాధించడం ఎంతో గర్వంగా ఉందని చెబుతున్నారాయన.

పద్నాలుగేళ్ల వయసులో అండర్ 20 విభాగంలో ప్రపంచ టైటిల్ ని సొంతం చేసుకున్న రోజునుంచీ ఈ రోజు వరకూ తన కూతురు సాధించిన విజయాలను తలచుకుని మరీ మురిసిపోతుంటారా తండ్రి. 2001 తర్వాత ప్రపంచ చెస్ పోటీల్లో అడపాదడపా బంగారు పదకాలు, రజత పతకాలు, కాంస్య పతకాలు సాధిస్తూ వచ్చినా మళ్లీ ఇంత కాలానికి వరల్డ్ టైటిల్ గెలవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందంటున్నారాయన.

తల్లి అయిన తర్వాత తన ధ్యాసంతా పూర్తిగా పాపాయిమీదే ఉందని, మెల్లమెల్లగా ఒత్తిడిని అధిగమించి మళ్లీ తన కూతురు అద్భుతమైన విజయాలు సాధించడం మొదలుపెట్టిందనీ హంపి భర్త దాసరి అన్వేష్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

హంపికి ప్రశాంతంగా సాధన చేసుకునే అవకాశం..

తమ తల్లిదండ్రులు, అత్తమామలు ఇచ్చిన ప్రోత్సాహంతో హంపి క్రమశిక్షణతో క్రమం తప్పకుండా సరైన సమయంలో సరైన సాధన చేసిందనీ, తాము ఎప్పటికీ తమ కన్నవాళ్ల ప్రేమకు బదులు తీర్చుకోలేమనీ చెబుతున్నారు అన్వేష్. తాముకూడా తల్లిదండ్రులైన తర్వాత ఆ ప్రేమ విలువ మరింత పెరిగిందంటున్నారాయన.

నిజానికి హంపి, ఆమె భర్త పూర్తిగా వేర్వేరు రంగాల్లో ఉన్నారు. కానీ ఒకరి ప్రొఫెషన్ ని ఒకరు గౌరవించుకుంటూ సాగిపోయే ఆదర్శ దాంపత్యం వారిది. వీలైనంతవరకూ హంపికి కావాల్సిన మానసిక ప్రోద్బలాన్ని అందించడమే మొత్తం రెండు కుటుంబాల లక్ష్యమనీ, హంపి సాధించిన విజయాలు చరిత్రలో చిర స్థాయిగా నిలచిపోతాయన్న విషయం మాత్రమే మొత్తం రెండు కుటుంబాల్లో అందరికీ ఎప్పటికీ గుర్తుంటుందనీ చెబుతున్నారు.

అమెరికాలో ఎలక్రికల్ ఇంజినీరింగ్ చదివిన అన్వేష్ ప్రస్తుతం విజయవాడలో తన సొంత వ్యాపారాన్ని నడుపుతున్నారు. ఆఫీస్ కెళ్తే ఆయనకు కూడా క్షణం తీరిక దొరకదు. కానీ అన్నింటా అన్ని వేళలా అన్నీ తానై అయి తన భార్యకు అండగా నిలబడతారు అన్వేష్. కుటుంబ బాధ్యతలనన్నింటినీ తనపై వేసుకుని హంపికి ప్రశాంతంగా సాధన చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారాయన.

తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ సెక్రటరీ ఎన్.శివప్రసాద్ మాటల్లో చెప్పాలంటే ఆటపట్ల హంపికి ఉన్న అంకితభావం గురించి వర్ణించడానికి మాటలు చాలవు. ఎప్పటికప్పుడు తన ప్రతిభకు పదునుపెట్టుకుంటూ నిబ్బరంగా ముందుకు సాగిపోతూ, అద్భుతమైన విజయాలను సాధించే హంపి భవిష్యత్తుల్లో తప్పకుండా మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు.

హంపి తన పన్నెండు నెలల పాపాయిని ఇంటి దగ్గరే వదలిపెట్టి వచ్చి గత ఆగస్ట్ నెలలో హైదరాబాద్ లో జరిగిన చెస్ పోటీల ప్రిపరేటరీ ఒలంపియాడ్ లో పాల్గొన్న సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఒక్కసారి తను చెస్ బోర్డ్ ముందు కూర్చుందంటే ప్రపంచాన్నే మర్చిపోతుందని చెబుతున్నారాయన. అలా ఒలంపియాడ్ లో పాల్గొంటూనే పాపాయి ఏడ్చినప్పుడల్లా ఫోన్ లో మాట్లాడుతూ ఆటమీదే దృష్టిని నిలపగలిగిన హంపీ సామర్ధ్యాన్ని ఆయన బహువిధాలుగా ప్రశంసించారు.

Next Story
Share it