శరణార్థుల సాయం.. ఆమె ధ్యేయం..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 3 Aug 2020 4:44 PM ISTపెద్దయ్యాక ఏమవుతావు? తరచూ చిన్నపిల్లల్ని పెద్దలు అడిగే ప్రశ్న. చాలా మంది పిల్లలు అవగాహన లేకుండానే డాక్టరవుతా, ఇంజనీరవుతా అనేస్తుంటారు. తలిదండ్రులు తెగ మురిసిపోతుంటారు. కానీ రెజ్‌గర్డి మాత్రం తాను కచ్చితంగా లాయర్‌నవుతా అంది. తన కోసమో.. బాగా డబ్బులు సంపాదించవచ్చనో కాదు. తమలాగే శరణార్థులుగా మారిన అభాగ్యులకు న్యాయం అందించేందుకు. శరణార్థి శిబిరంలోనే తల్లి గర్భంనుంచి ఈ లోకానికి వచ్చిన రెజ్ వారి దీనగాధలను అర్థం చేసుకోవడమే కాదు.. రక్తంలో జీర్ణం చేసుకుంది. ఇంతకూ ఎవరీ రెజ్‌గర్దీ..?
పాకిస్తాన్‌లో ఓ శరణార్థుల శిబిరంలో.. 1991 రెజ్ గర్ది జన్మించింది. చిన్నప్పటి నుంచి శరణార్థుల దీనగాధలు వింటూ పెరిగింది. వారి కష్టాలను దగ్గరగా చూసింది. తమ కుటుంబం లాగానే చాలామంది అభాగ్యులు తలదాచుకుని బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్ళదీస్తున్నారన్న నిష్ఠురసత్యం రెజ్‌కు అర్థమవుతూ వచ్చింది. అప్పుడే తనో న్యాయవాది కావాలనుకుంది. ఆ లక్ష్యంతోనే శ్రమించింది. రెజ్‌గర్ది కుటుంబం పూర్వీకులది ఇరాక్. కుర్దు వర్గానికి చెందినవారు. వీరి అమ్మమ్మ పై యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడిలో పిన్నమ్మలు మామయ్యలు మరణించారు.
టర్కీకి చెందిన రెజ్ తండ్రి కుర్దూల అణచివేతను సహించలేక కుర్దిస్తాన్‌కు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇరాక్ నుంచి ఇరాన్‌కు మారారు. అప్పుడే ఉధృత స్థాయిలో ఉన్న కుర్దిష్ మానవహక్కుల ఉద్యమంలో రెజ్ తల్లి పరిచయం అయింది. ఆ పరిచయం పెళ్ళిదాకా వెళ్ళింది. తదనంతర కాలంలో వారు పాకిస్తాన్‌లోని శరణార్థ శిబిరంలో తలదాచుకున్నారు. అక్కడే రెజ్ పుట్టింది. 1998 దాకా రాజకీయ శరణార్థులుగా పాకిస్తాన్‌లోనే తలదాచుకున్నారు. ఆ తర్వాత పునరావాసం కింద న్యూజిలాండ్‌కు కదిలారు.
అచ్చం అభిమన్యుడిలాగే రెజ్ తల్లి గర్భంలోనే శరణార్థుల దీనగాధలు వింది కాబోలు. పుట్టిన కొద్ది కాలానికే తన లక్ష్యమేంటో తనే ప్రకటించుకుంది. ఎలాగైనా సరే కష్టాల్లో కనలిపోతున్న తనవారికి ఆదుకునేందుకు ఏది అవసరమో ఆ చదువే చదవాలనుకుంది. అక్లాండ్‌లో 2016లో డిగ్రీపూర్తిచేసింది. 2019లో హార్వర్డ్ స్కూల్‌లో లా చదువుకుంది.
హార్వర్డ్ వర్సిటీలో చదువుకున్న మొదటి కుర్దూ మహిళగా గుర్తింపు పొందింది. అమెరికా, న్యూజిలాండ్‌లో లాయర్‌గా ప్రాక్టీసు చేయడానికి అర్హత సాధించగలిగింది. బార్ కౌన్సిల్‌లో సభ్యురాలైంది. అక్లాండ్ వర్సిటీలో సెంటర్ ఫర్ ఏసియా పసిఫిక్ రెఫ్యూజీ కు సహ వ్యవస్థాపకురాలు రెజ్. ఓ కార్పొరేట్ న్యాయ సంస్థ కోటిన్నర జీతం (భారత్ కరెన్సీ) జీతమిస్తామన్నా సున్నితంగా తిరస్కరించింది. తన లక్ష్యమేంటో ఆమెకు స్పష్టంగా తెలుసు మరి.
ఇరాక్‌లోని ఐఎస్ తీవ్రవాదులపై ఏకంగా దండయాత్రే ప్రకటించింది. హ్యూమన్ ట్రాఫికింగ్, మహిళలపై దాడులపై ప్రపంచానికి తెలిసేలా ఎలుగెత్తి చాటాలనుకుంది. మీడియా మానవహక్కుల సంఘం దృష్టికి రాలేని ఎన్నో ఘటనలను వెలికితీయడమే లక్ష్యంగా శ్రమిస్తోంది. నిందితులు వివిధ దేశాల్లో తలదాచుకుంటున్నారు. మరి వారికి శిక్షపడటం అంత సులువు కాదు. కానీ ఎన్నేళ్ళయినా సరే వారికి వ్యతిరేకంగా పోరాడుతుంటూనే ఉంటా అంటోంది.
రెజ్ పోరాటానికి గుర్తింపుగా 2017లో యంగ్ న్యూజిలాండ్ ఆఫ్‌ది ఇయర్ అవార్డు లభించింది. న్యూజిలాండ్ తరఫున ఎన్నో అంతర్జాతీయ సదస్సుల్లో పాలుపంచుకుంది. కుర్దిష్ యువశరణార్థులకు చదువు, ఉపాధి కోసం ఎంపవర్ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసింది.
నిత్యం సంఘర్షణకు ఎదురీదే కుటుంబం నుంచి వచ్చిన రెజ్ తన స్వార్థం చూసుకోకుండా తమలాగా నిస్సహాయులుగా శరణార్థులుగా మారిన అభాగ్యులకు ఆపన్నహస్తం అందించేందుకు సిద్ధమైంది. ఉన్నత చదువులు, ఉన్నత కొలువులు ఎవరైనా సాధిస్తారు. అయితే ఉన్నత లక్ష్యాలను మాత్రం కొందరే అందుకుంటారు. అలా అందుకున్నవారి వెనక అనునిత్యం శ్రమించిన ఓ కఠోరదీక్ష కనిపిస్తుంటుంది. రెజ్ గర్దీ అలాంటి వ్యక్తిత్వం ఉన్న అంతర్జాతీయ యువ న్యాయవాది!!