మనుషులు చల్లబడిపోతున్నారోచ్..!

By అంజి  Published on  11 Jan 2020 12:49 PM GMT
మనుషులు చల్లబడిపోతున్నారోచ్..!

మనం రోజు రోజుకూ చల్లబడిపోతున్నామా? అవుననే అంటున్నాయి తాజా అధ్యయనాలు. 1851 ప్రాంతంలో సగటు ఆరోగ్యవంతుడి శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారిన్ హీట్ ఉండేది. దీని కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటే సదరు వ్యక్తికి జ్వరం వచ్చినట్టు. అయితే ఇప్పుడు 2000 సంవత్సరంలో చేసిన అధ్యయనాలను బట్టి చూస్తే సగటు శరీర ఉష్ణోగ్రత 97.5 డిగ్రీలే ఉందని తేలింది.

శాస్త్రవేత్తలు అమెరికాలో 1862లో జరిగిన అంతర్గత పోరులో పాల్గొన్న జవాన్ల తాలూకు రికార్డులు, రెండో ప్రపంచానికి ముందు 1930 ప్రాంతంలో జాతీయ ఆరోగ్య సర్వేలో సేకరించిన వివరాలు, 1975 ప్రాంతంలో నిర్వహించిన ఆరోగ్య సర్వే, ఆ తరువాత 2007-2017 మధ్య అమెరికాలోని స్టాన్ ఫొర్డ్ యూనివర్సిటీ వద్ద అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈ నిర్ధారణకు రావడం జరిగింది. 2000 తరువాత పుట్టిన వారి శరీర ఉష్ణోగ్రత సగటున 97.5 గా ఉందని తేలింది. అంటే 1800 తో పోలిస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గింది. మహిళల శరీర ఉష్ణోగ్రత కూడా గణనీయంగా తగ్గిందని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.

ఇలా ఎందుకు జరుగుతోందన్నది మాత్రం శాస్త్రవేత్తలు ఇదమితంగా చెప్పలేకపోతున్నారు. దంతాల పరిశుభ్రత వల్ల, ఆరోగ్యపరమైన జాగ్రత్తల వల్ల, ఎండాకాలమైనా, చలికాలమైనా ఒకే ఉష్ణోగ్రతను ఏసీల ద్వారా మెయింటెయిన్ చేయడం ద్వారా ఇలా జరుగుతూ ఉండవచ్చునని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మాత్రం 97.5 డిగ్రీల టెంపరేచర్ ను నార్మల్ టెంపరేచర్ గా బావించాలని వారు అంటున్నారు.

“మనం గతం తో పోలిస్తే చాలా మారిపోయాం. మనం నివసించే వాతావరణం మారిపోతోంది. కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చాయి. కొత్త కొత్త ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త వైరస్, బాక్టీరియాలు మనల్ని చుట్టుముట్టేస్తున్నాయి. మన ఆహారంమారిపోయింది. అందుకే శరీర ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చిందంటూ ఈ అధ్యయనాన్ని నిర్వహించిన స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జూలీ పార్సొనెట్ అంటున్నారు. అమెరికాలో వచ్చిన ఈ మార్పులు ప్రపంచమంతటా కూడా వచ్చాయా లేదా అన్నది తేలాల్సి ఉందని ఆమె అంటున్నారు.

Next Story