రాజ్యసభలో పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టిన అమిత్ షా

By రాణి
Published on : 11 Dec 2019 12:55 PM IST

రాజ్యసభలో పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టిన అమిత్ షా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో పౌరసత్వ( సవరణ )బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం అమిత్ షా సభలో మాట్లాడుతూ..ఇది ఒక చారిత్రాత్మక బిల్లుగా ఉంటుందన్నారు. దీనిద్వారా ఇండియాలో మైనార్టీలకు పూర్తి రక్షణ ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకూ తరతరాలుగా శరణార్థులకు అన్యాయం జరిగిందని, దేశ విభజనతో వారంతా తీవ్ర వివక్షకు గురయ్యారన్నారు. ఇకపై మైనార్టీల హక్కులకు ఎలాంటి విఘాతం ఉండదన్నారు. మైనార్టీల కోసం ప్రభుత్వం ప్రత్యేక బిల్లు చేస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక తప్పుడు అపోహలు సృష్టిస్తున్నాయని అమిత్ షా విమర్శించారు.

ఈ బిల్లును గురించి ఈశాన్య రాష్ర్టాల ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బిల్లును తీసుకురాలేదని స్పష్టత ఇచ్చారు.

రాజ్యసభలో బిల్లు ప్రవేశ పెట్టకముందు..ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ పారసత్వ సవరణ బిల్లును గురించి ప్రస్తావించారు. ఈ చట్టాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారని మోదీ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ లలో మతపరమైన దాడులెదుర్కొంటున్న మైనార్టీలకు ఇది శాశ్వత ఉపశమనాన్ని ఇస్తుందని మోదీ వివరించారు. ఈ బిల్లు విషయంలో ప్రతిపక్షాలు శత్రు దేశం తరహాలు వ్యాఖ్యలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రైతులు, పారిశ్రామిక వేత్తలతో సహా సమాజంలలోని అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించాలని ఎంపీలకు సూచించారు.

Next Story